TRS OPERATION AKARSH: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్శ్ కు తెర తీయడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న నేతలను తిరిగి సొంతగూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్.. నేరుగా రంగంలోకి దిగారని సమాచారం. కేసీఆరే స్వయంగా పాత నేతలతో మాట్లాడుతుండటంతో వారంతా కారెక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గురువారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గులాబీ గూటికి చేరగా.. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ తిరిగి సొంత గూటికి వచ్చేశారు.
గతంలో ఉద్యమంలో పని చేసి.. టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన పార్టీని వీడి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్శ్ కు తెరలేపారు. పాత నేతలను రప్పించేందుకు గులాబీ బాసే స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. వలస నేతలతో బలం పుంజుకున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్న కమలనాధులకు.. వలసలతోనే చెక్ పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో తనతో పని చేసిన ఉద్యమ నేతలకు కేసీఆరే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి.. తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆపరేషన్ తో ఇప్పటికే దాసోజు చేరికకు లైన్ క్లియర్ కాగా.. శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితోనూ కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.
ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలో చేరిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితోనూ కేసీఆర్ మాట్లాడారని చెబుతున్నారు. కేసీఆర్ కు ఫోన్ లో అందుబాటులో లేని నేతల కోసం ప్రత్యేకంగా దూతలను పంపిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న నేతలందరిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ వస్తోంది.పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్ మాట్లాడటంతో చాలా మంది నేతలు తిరిగి కారెక్కేందుకు సిద్దమవుతున్నారని.. స్వామి గౌడ్ చేరిక దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో కేసీఆర్ మాట్లాడారని అంటున్నారు. ఉద్యోగుల సంఘం నేత విఠల్ కూడా తిరిగి టీఆర్ఎస్ లో చేరనున్నారని ప్రచారం సాగినా.. ఆ వార్తలను ఆయన ఖండించారు. తన శ్వాస పోయే వరకు బీజేపీలోనే ఉంటానని విఠల్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్శ్ తో తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగింది. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ వరకు పరిస్థితులు మరింతగా మారిపోతాయంటున్నారు. బీజేపీ నుంచి చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ తాజా వ్యూహాలకు చెక్ పెట్టేలా బీజేపీ ప్లాన్ చేస్తుందని సమాచారం.
Also Read : Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం
Also Read : Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook