భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ తనకు ప్రాణహానీ ఉందని.. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం 0.32 రివాల్వర్ లేదా పిస్టల్ వాడేందుకు లైసెన్స్ కావాలని ఆమె ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు దరఖాస్తు చేశారు. తాను ఎక్కువ సేపు ఒంటరిగానే ఇంటిలో నివసించాల్సి వస్తుందని.. అలాగే బయటకు వెళ్లినప్పుడు కూడా కొన్ని పనులు ఒంటరిగానే చేయవలసి వస్తుందని ఆమె తెలిపారు.
ఈ క్రమంలో ఒక సెలబ్రిటీ భార్యగా తనకు అప్పుడప్పుడు బయట వ్యక్తులతో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని.. అందుకే ఆత్మరక్షణ కోసం రివాల్వర్ వాడేందుకు లైసెన్స్ ఇవ్వాలని ఆమె తెలిపారు. 2010లో ధోని కూడా స్వయంగా రివాల్వర్ కోసం దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఆయన తనవద్ద 9 ఎంఎం పిస్టల్ కలిగి ఉన్నారు. సాధారణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ లైసెన్స్‌లను మంజూరు చేస్తుంది.
ఆర్మ్స్ యాక్ట్ 1959 క్రింద కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఎవరికైనా గన్ లైసెన్స్ మంజూరు చేస్తుంది. గన్ లైసెన్స్ పొందే వ్యక్తికి ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలాగే డీసీపీ స్థాయి అధికారి ద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై ఎంక్వయరీ జరుగుతుంది. ప్రస్తుతం పలువురు సినీ నటులతో పాటు రాజకీయ నాయకులకు కూడా మన దేశంలో గన్ లైసెన్స్ ఉంది.
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వెబ్ సైటులో గన్ లైసెన్స్ దరఖాస్తులు లభ్యమవుతాయి. గన్ లైసెన్స్ పొందిన వ్యక్తి కచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెఫ్టీ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 60 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి దరఖాస్తును తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది.