Happiest State In India: ఇండియాలో ఎక్కువ శాతం జనం సంతోషంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అంటే మీరు సమాధానం చెప్పగలరా ? లేదంటే ఇదిగో ఈ డేటాపై ఒకసారి లుక్కేయండి. ఇండియాలో మిజోరం హ్యాప్పీయెస్ట్ స్టేట్ గా నిలిచింది. గురుగ్రామ్ లోని మేనెజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో స్ట్రాటెజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న రాజేష్ కే పిల్లానియా అనే ప్రొఫెసర్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాకుండా, దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగా మిజోరం ఘనత సాధించింది. భౌగోళికంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్న మిజోరంలో విద్యార్థుల వికాసం కోసం, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
హ్యాపీయెస్ట్ స్టేట్ అనగానే.. ఏయే అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం జరిగింది, ఏ రాష్ట్రం ఎక్కువ సంతోషంగా ఉందని ఎలా నిగ్గు తేల్చారనే సందేహమే మొదటిగా వస్తుంది. అక్కడికే వస్తున్నాం.. కుటుంబ బాంధవ్యాలు, ఉపాధి సంబంధిత అంశాలు, సామాజిక సమస్యలు, ఇతరులకు సాయం చేసే పరోపరకారి గుణం, మతపరమైన అంశాలు, శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ప్రజల సంతోషంపై కొవిడ్-19 ప్రభావం వంటి మొత్తం ఆరు అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం జరిగింది.
ఈ అధ్యయనానికి సంబంధించి ఐజ్వాల్‌లో మిజోరం గవర్నమెంట్ హై స్కూల్‌కి చెందిన ఓ విద్యార్థితో మాట్లాడినప్పుడు.. అతడు ఏం చెప్పాడంటే, తన చిన్నప్పుడే తన తండ్రి తమ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని.. అప్పటి నుంచి తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులపాలైందని అన్నాడు. అయినప్పటికీ తాను చదువులో రాణిస్తున్నానని.. చార్టర్ ఎకౌంటెంట్ కావాలనేది తన లక్ష్యం అని చెబుతున్నాడు. ఒకవేళ ఏదైనా కారణంతో అది కుదరని పరిస్థితుల్లో సివిల్స్‌లో విజయం సాధించాలి అనేది తన లక్ష్యం అని ధృడనిశ్చయంతో చెప్పడం చూస్తోంటే అతడు అనుకున్నది సాధిస్తాడనే ఆత్మ విశ్వాసం అతడి మాటల్లో తొనికిసలాడుతోంది.
అలాగే, మిజోరం గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న మరో విద్యార్థితో మాట్లాడగా.. అతడు నేషనల్ డిఫెన్స్ అకాడమిలో చేరాలనే ధృడ సంకల్పంతో చదువుకుంటున్నట్టు చెప్పాడు. ఆ స్టూడెంట్ తండ్రి ఒక మిల్క్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తల్లి గృహిని. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా తమ కెరీర్ పట్ల స్పష్టమైన లక్ష్యంతో, సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అందుకు కారణం వారు చదువుతున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారికి అందుతున్న నాణ్యమైన విద్యే అని అధ్యయనంలో తేలింది.
తమకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా.. పాఠశాలలో టీచర్లతో పంచుకుంటామని, వారు కూడా అన్ని సందేహాలు నివృత్తి చేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా తరచుగా మిజోరంలో పనిచేసే టీచర్లు తరచుగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా కలిసి విద్యార్థుల ప్రతిభ గురించి చర్చిస్తుంటారని తెలిపారు.
మరోవైపు మిజోరంలో ఉన్న సామాజిక పరిస్థితులు, మౌళిక సదుపాయాలు కూడా అక్కడి యువత అభివృద్దికి సహాయపడుతున్నాయి. కులమతాల పట్టింపులు లేకపోవడం, పిల్లల చదువుపై తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు లేకపోవడం వంటి అంశాలు ఇక్కడి యువతను సంతోషంగా ఉంచుతున్నాయి అని ఇబెన్-ఇజర్ బోర్డింగ్ స్కూల్ అనే ప్రైవేటు స్కూల్ టీచర్ సిస్టర్ లల్రిన్మావికియాంగ్టే అభిప్రాయపడ్డారు.
అన్నింటికిమించి, కులమతాలతో సంబంధం లేకుండా, లింగబేధాలు లేకుండా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారి పిల్లలు చిన్న వయస్సులోంచే సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేలా స్వతహాగా పనిచేసి సంపాదించడం మొదలుపెడుతుంటారు. 16-17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే చిన్న పని అని భావించకుండా ఏదో ఒక పనిచేసుకుంటూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు అని అధ్యయనంలో తేలింది. ఇలాంటి అంశాలన్నీ ఆ రాష్ట్రాన్ని హ్యాపీయెస్ట్ స్టేట్స్ జాబితాలో అగ్ర స్థానంలో నిలబెట్టాయి.