Eid ul Fitr 2022: నెలరోజులుగా కఠిన ఉపవాసదీక్షల సమయం ముగిసింది. ఈదుల్ ఫిత్ర్ లేదా రంజాన్ పండుగ వచ్చేసింది. భారత ఉపఖండంలోని ముస్లింలు రేపు పండుగ జరుపుకోనున్నారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ విశిష్టత ఏంటి, ఎలా జరుపుకుంటారో చూద్దాం.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ అనేది ఓ నెల పేరు. ముస్లింల పవిత్ర గ్రంథం ఈ నెలలోనే అవతరించినందున గౌరవ సూచకంగా నెలరోజులు పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రమానం ప్రకారం ఉంటుంది. అంటే నెలకు 29 లేదా 30 రోజులుంటాయి. అందుకే రంజాన్ నెలలో 29 రోజుల ఉపవాసాలు పూర్తయిన తరువాత చంద్రుడి కోసం చూడాలి. చంద్రదర్శనమైతే 30వ రోజు పండుగ జరుపుకోవాలి. లేకపోతే 30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసి చంద్రదర్శనంతో నిమిత్తం లేకుండా 31వ రోజు పండుగ జరుపుకుంటారు.
ఇండియాలో ఎప్పుడు, సౌదీ దేశాల్లో ఎప్పుడు
ఇండియాలో ఏప్రిల్ 3వ తేదీన ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. నిన్న అంటే మే 1వ తేదీకు 29 రోజులు. నిన్న భారత ఉపఖండంలో చంద్రదర్శనం కానందున ముస్లింలు ఇవాళ కూడా ఉపవాసాలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా రేపు అంటే మే 3వ తేదీన ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకోనున్నారు. అటు సౌదీ దేశాల్లో ఉపవాసాలు ఏప్రిల్ 2న ప్రారంభమయ్యాయి. 29 రోజుల తరువాత అంటే ఏప్రిల్ 30వ తేదీన చంద్రదర్శనం కాలేదు. దాంతో ఆ దేశాల్లో 30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసుకుని ఇవాళ అంటే మే 2వ తేదీన పండుగ జరుపకుంటున్నారు.
ఈదుల్ ఫిత్ర్ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు
రంజాన్ నెలంతా ఉపవాసాలు ఉన్న తరువాత జరుపుకునే పండుగను ఈదుల్ ఫిత్ర్ అంటారు. అంటే ఫిత్రాల పండుగ. ఫిత్రా అంటే ఓ ప్రత్యేకమైన దానం. పండుగకు ముందు రోజు..ఇంట్లోని కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి...అన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు పేదలకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది విధి. అంటే ఓ కుటుంబంలో ముగ్గురు ఉంటే..ఒక్కొక్కరికి 2.60 కిలోల చొప్పున మనం ఏదైతే తింటున్నామో అదే బియ్యం లేదా అదేరకం గోధుమల్ని తీయాలి. ముగ్గురు కుటుంబసభ్యులుంటే 7.8 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కుటుంబసభ్యుల సంఖ్యను..2.60 కిలోలతో గుణించి..తీయాలి. దీన్నే ఫిత్రా అంటారు. ఇది ఇవ్వకపోతే పండుగ జరుపుకోవడంలో అర్ధమే లేదు.
ఈదుల్ ఫిత్ర్ పండుగ రోజు ముస్లింలు సాధారణంగా సామూహిక ప్రార్ధనలు జరుపుకుంటారు. మసీదులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో కలిసికట్టుగా ఆ రోజు ఉదయం ప్రత్యేక ప్రార్ధనలు జరుపుకుంటారు. ఇదే ఓ 40 నిమిషాల సేపు కొనసాగుతుంది. ఆ తరువాత ఇంటికొచ్చి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. బంధుమిత్రుల్ని ఇంటికి విందుకు ఆహ్వానిస్తుంటారు.
Also read: Eid ul fitr 2022: ఇండియా, సౌదీ అరేబియాలో ఈదుల్ ఫిత్ర్ ఎప్పుడు, చంద్రుడిని ఎప్పుడు చూడాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.