Glenn Maxwell: చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్.. అఫ్గాన్‌పై ఆసీస్ విజయం

Australia vs Afghanistan Highlights: గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆస్ట్రేలియాను గెలిపించాడు. అఫ్గానిస్థాన్‌పై విజయంతో ఆసీస్ సెమీస్‌కు చేరింది. గాయంతో కదల్లేని పరిస్థితుల్లో క్రీజ్‌లో పాతుకుపోయి మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 7, 2023, 11:37 PM IST
Glenn Maxwell: చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్.. అఫ్గాన్‌పై ఆసీస్ విజయం

Australia Vs Afghanistan Highlights: అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇందులో కొత్తేమి లేదు గానీ.. గెలిచిన తీరు మాత్రం అద్భుతం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (201 నాటౌల్) పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. జట్టును గెలిపించాడు. గాయం బాధిస్తున్నా.. పంటి బిగువునా నొప్పి భరిస్తూ.. కమ్మిన్స్ (12 నాటౌట్) అండతో ఆసీస్‌ను ఓటమి అంచుల నుంచి గట్టెక్కించాడు. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్.. ఆసీస్ తరుఫున తొలి డబులు సెంచరీ బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో కంగారూ టీమ్ 91 పరుగులకే 7 వికెట్లు పడిపోగా.. మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ఆసీస్ సెమీస్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మ్యాచ్‌లలో ఈ వన్డే కూడా నిలిచిపోనుంది.  

అఫ్గానిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఆరంభం నుంచే తడపడింది. అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి తేలిపోయింది. 2వ ఓవర్లోనే ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను నవీన్‌ ఉల్‌ హక్‌ డకౌట్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న మిచెల్ మార్ష్‌ (24)ను కూడా నవీన్ ఎల్‌బీడబ్ల్యూ చేసి మళ్లీ దెబ్బ తీశాడు. తరువాత డేవిడ్‌ వార్నర్‌ (18)ను ఒమర్జాయి బౌల్డ్‌ చేశాడు. వికెట్ కీపర్ జోష్‌ ఇంగ్లిస్‌ (0) గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. లబుషేన్‌ (14) రనౌట్‌ అవ్వడం.. స్టోయినిస్‌ (6), మిచెల్ స్టార్క్‌ (3) వెంట వెంటనే ఔట్ అవ్వడంతో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా అడుగులు వేసింది. అఫ్గాన్ బౌలర్ల జోరు చూస్తుంటే.. ఆసీస్‌ను భారీ తేడాతో ఓడించేలానే కనిపించింది.

అయితే మ్యాక్స్‌వెల్ మాత్రం వదల్లేదు. క్రీజ్‌లో పాతుకుపోయి కెప్టెన్ పాట్ కమిన్స్ (12 నాటౌట్) సహకారంతో సిక్సర్లు, ఫోర్లతో లక్ష్యం దిశగా నడిపించాడు. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో సాయంతో 201 పరుగుల చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో కాలి నొప్పి బాధించిన తట్టుకుని నిలబడ్డాడు. ఒంటికాలిపై బరువు వేస్తూ.. గ్యాప్‌లు చూసుకుంటూ ఫోర్లు, సిక్సర్లతోనే జట్టును విజయపథంలో నడిపించాడు. అవతలి ఎండ్‌లో కెప్టెన్ కమిన్స్ మాక్స్‌వెల్‌కు చక్కగా సహకరించాడు. 68 బంతుల్లో 12 పరుగులే చేసినా వికెట్ ఇవ్వకుండా అడ్డుగోడగా నిలబడ్డాడు. చివరికి సిక్సర్‌ బాది మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మాక్స్‌వెల్‌ దూకుడుతో 19 బంతులు మిగిలుండగానే ఆసీస్ విజయం సొంతం చేసుకుంది. 

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  291 రన్స్ చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (143 బంతుల్లో 129 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో. వరల్డ్ కప్‌లో శతకం బాదిన తొలి అఫ్గాన్ ప్లేయర్‌గా నిలిచాడు. చివర్లలో రషీద్ ఖాన్ 15 బంతుల్లో 35 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మిచెల్‌ స్టార్క్‌, మ్యాక్స్‌వెల్‌, జంపా చెరో వికెట్ తీశారు. చివరి లీగ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.  

Also Read:  CM KCR: నీళ్ల కోసం ఏడ్చినం.. 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్: సీఎం కేసీఆర్ ఫైర్  

Also Read: Yatra 2 Movie: యాత్ర-2లో సోనియా పాత్ర పోషించిన జర్మనీ నటి ఎవరంటే..? ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News