India Head Coach Rahul Dravid says We are not played well in 2nd innings: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు బాగా ఆడలేదని.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాం అని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. భారత్ ఓటమికి వేరే సాకులు చెప్పదలుచుకోలేదన్నారు. జో రూట్, జానీ బెయిర్‌స్టో అద్భుతంగా ఆడారని ద్రవిడ్ కొనియాడారు. భారత్ నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రూట్ (142 నాటౌట్; 173 బంతుల్లో 19x4, 1x6), బెయిర్‌స్టో (114 నాటౌట్; 145 బంతుల్లో 15x4, 1x6) సెంచరీలతో కదం తొక్కారు.
మ్యాచ్ అనంతరం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... 'ఐదవ టెస్టులో మేం తొలి మూడు రోజులు బాగాఆడాం. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఆడలేకపోయాం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాం. మ్యాచ్ గెలవాలన్న కసిని కొనసాగించలేకపోయాం. ఇంగ్లండ్ గొప్పగా ఆడింది. పోరాడి మరీ విజయం సాధించింది. కచ్చితంగా ఇంగ్లీష్ జట్టును మెచ్చుకోవాలి. జో రూట్, జానీ బెయిర్‌స్టో బాగా ఆడారు. ఇద్దరు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మాకు అవకాశాలొచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం' అని అన్నారు.
'ఈ ఓటమి మమ్మల్ని నిరాశకు గురిచేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అవకాశాలు వచ్చినా సద్వినియోగ చేసుకోలేకపోయాం. ఇక్కడా అదే జరిగింది. ఎక్కడ తప్పు జరుగుతుందో సరిద్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ కొన్నేళ్లుగా ప్రత్యర్థులను 20 వికెట్లు తీసి విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ ఇటీవల 20 వికెట్లు తీయలేకపోతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఇటీవలి కాలంలో విదేశాల్లో ఈ లోపం కనిపిస్తోంది. మొదట బాగానే ఆరంభిస్తున్నా.. చివరికి విజయం అందుకోలేకపోతున్నాము' అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చారు.
'తొలి రోజు పిచ్ చూసినప్పుడు పేసర్లకు అనుకూలిస్తుందనుకున్నాం. చివరి వరకు కూడా బంతి స్పిన్ కాలేదు. పిచ్‌లో పెద్దగా మార్పు లేదు కాబట్టి రెండో స్పిన్నర్ ఉన్నా ఫలితం ఇలానే ఉండేదేమో. తొలి నాలుగు టెస్టులు జరిగినపుడు నేను లేను. అప్పుడు ఇంగ్లండ్ కొంచెం ఇబ్బంది పడ్డా ఇప్పుడు బాగా ఆడింది. మనం టెస్టులు ఆడి చాలా రోజులైంది. ఏదేమైనా ఓటమికి సాకులు చెప్పదలుచుకోలేదు' అని టీమిండియా కోచ్ పేర్కొన్నారు.
Also Read: ENG vs IND 5th Test: చెత్త బౌలింగ్.. టీమిండియా బౌలర్లపై సెహ్వాగ్ ఫైర్!
Also Read: Anemia: మీ శరీరంలో రక్తం కోరతగా ఉందా.. అయితే ఇది మీ కోసమే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook