ట్రాన్స్‌జెండర్లకు మద్దతు ప్రకటించిన గౌతం గంభీర్.. దుపట్టా ధరించిన క్రికెటర్

భారతీయ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ట్రాన్స్‌‌జెండర్ల సమస్యలపై గళమెత్తారు. వారి హక్కులకై చేస్తున్న పోరాటానికి తాను కూడా మద్దతిస్తానని ఆయన తెలిపారు. 

Updated: Sep 15, 2018, 03:13 PM IST
ట్రాన్స్‌జెండర్లకు మద్దతు ప్రకటించిన గౌతం గంభీర్.. దుపట్టా ధరించిన క్రికెటర్
Image Credit: PTI

భారతీయ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ట్రాన్స్‌‌జెండర్ల సమస్యలపై గళమెత్తారు. వారి హక్కులకై చేస్తున్న పోరాటానికి తాను కూడా మద్దతిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన హిజ్రా హెబ్బా సభలో ఆయన ఎల్‌జీబీటీ కమ్యూనిటీలకు మద్దతిస్తూ మాట్లాడారు. తాను కూడా బిందీ పెట్టుకొని.. దుపట్టా కప్పుకొని వారికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఇటీవలే స్వలింగ సంపర్కం నేరం కాదని చెబుతూ.. అది సెక్షన్ 377 కిందికి రాదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ తమ తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా గంభీర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

ఒకరి హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. భారతీయులందరూ ఒకరినొకరు వివక్షతో కాకుండా గౌరవంగా చూడాలని కోరుతున్నానని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు గంభీర్ మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని.. గంభీర్ ట్రాన్స్‌జెండర్లను కలిసి వారితో రాఖీ కట్టించుకున్నారు. "ఇది స్త్రీ సమస్యో, పురుషుడి సమస్యో కాదు.. మానవత్వానికి సంబంధించిన సమస్యగా దీన్ని పేర్కొనాలి" అని ఆయన తెలిపారు. 

గౌతమ్ గంభీర్ 2003లో తొలిసారిగా వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. మొత్తం 147 వన్డే మ్యాచ్‌లు ఆడిన గంభీర్ 5000 పైగా పరుగులు చేశారు. అలాగే 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి అందులో 4000 పైగా పరుగులు చేశారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో కూడా ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులోకి ఎంపిక అయిన గంభీర్.. స్వదేశంలో జరిగిన టూర్ గేమ్‌లో డబుల్ సెంచరీ సాధించిన 4వ భారతీయుడిగా కూడా ఘనతకెక్కాడు.