Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?

India vs Ireland 1st T20 Preview and Updates: విండీస్‌ టూర్‌ తరువాత మరో సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. ఐర్లాండ్‌తో పొట్టి ఫార్మాట్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నేటి నుంచి మొదలుకానుంది. గాయం నుంచి కోలుకుని పురాగమనం చేస్తున్న బుమ్రాపైనే అందరి దృష్టినెలకొంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 18, 2023, 07:02 AM IST
Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?

India vs Ireland 1st T20 Preview and Updates: టీమిండియా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. గాయం కారణంగా 11 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. పసికూన ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేటి నుంచే ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన బుమ్రా.. జట్టును ముందుండి నడిపించడనున్నాడు. విండీస్‌తో ఆడిన జట్టులో సంజూ శాంసన్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌, రవి బిష్టోయ్, ముఖేష్‌ కుమార్‌తోపాటు ఐపీఎల్ స్టార్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అందరీ కళ్లు బుమ్రాపైనే ఉన్నాయి. ప్రపంచకప్‌కు ముందు బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో రెడీ అయితే భారత్ మరింత పటిష్టంగా మారుతుంది. డబ్లిన్‌లోని ది విలేజ్‌ వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 

ఓపెనర్లుగా వీళ్లే..

రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రానున్నారు. విండీస్‌పై మూడు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకున్న జైస్వాల్ ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో రాణిస్తే.. ఓపెనింగ్ స్లాట్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకుంటాడు. అటు రుతురాజ్ కూడా ఈ సిరీస్ ద్వారా సత్తా చాటాలని అనుకుంటున్నాడు. వెస్టిండీస్ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు ఈ సిరీస్ చివరి అవకాశం కావచ్చు. సంజూకు సెలెక్టర్లు వరుసగా అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. వన్‌డౌన్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. 

ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్ అరంగేట్రం చేయనున్నాడు. శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి పురాగమనం చేయనున్నారు. బుమ్రాతోపాటు ప్రసిద్ధ్ కృష్ట కూడా గాయం నుంచి కోలుకుని ఈ సిరీస్‌ ద్వారా రెడీ అవుతున్నాడు. వీరిద్దరితోపాటు అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. స్పిన్నర్‌గా రవి బిష్టోయ్ తుది జట్టులో ఉండనున్నాడు. జితేష్ శర్మ, షాబాజ్ అహ్మద్, ముఖేష్‌ కుమార్, అవేష్ ఖాన్ బెంచ్‌కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.

ఐర్లాండ్‌ను పసికూన అని తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇటీవల కరేబియన్ జట్టుతో ఓడిన భారత్.. ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయకూడదు. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హతసాధించి ఐర్లాండ్ జోరు మీద ఉంది. కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఐపీఎల్‌ సత్తాచాటిన పేసర్ జోష్ లిటిల్, ఆండ్రూ బల్‌బర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, టకర్, జార్జ్ డాక్రెల్ వంటి ప్లేయర్లతో టీమిండియాకు సవాల్ విసిరేందుకు రెడీ అవుతోంది. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌ అయినా గెలవాలని పట్టుదలతో ఉంది.

తుది జట్లు ఇలా.. (అంచనా)

భారత్: రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్‌బర్నీ, మార్క్ అడైర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫెర్, ఫియోన్ హ్యాండ్, జార్జ్ డాక్రెల్, లోర్కాన్ టక్కర్, జోష్‌ లిటిల్‌, బారీ మెక్‌కార్తీ.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x