IPL 2020 players auction : ఐపిఎల్ 2020 వేలం: హాట్ కేకుల్లా అమ్ముడైన అండర్ 19 ఆటగాళ్లు, వాళ్ల ధరలు

క్రికెట్‌లో బాగా పర్‌ఫామ్ చేస్తోన్న ఆటగాళ్లకు ఐపీఎల్ 2020 టోర్నమెంట్ కాసులు కురిపిస్తోంది. రంజీల్లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు భారీ మొత్తం వెచ్చించైనా సొంతం చేసుకునేందుకు ఐపిల్ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఫలితంగా దేశవాళీ క్రికెట్ ఆటగాళ్ల జీవితంలో ఐపిఎల్ వేలం పంట పండిస్తోంది.

Last Updated : Dec 20, 2019, 12:09 AM IST
IPL 2020 players auction : ఐపిఎల్ 2020 వేలం: హాట్ కేకుల్లా అమ్ముడైన అండర్ 19 ఆటగాళ్లు, వాళ్ల ధరలు

న్యూఢిల్లీ: డొమెస్టిక్ క్రికెట్‌లో బాగా పర్‌ఫామ్ చేస్తోన్న ఆటగాళ్లకు ఐపీఎల్ 2020 టోర్నమెంట్ కాసులు కురిపిస్తోంది. రంజీల్లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు భారీ మొత్తం వెచ్చించైనా సొంతం చేసుకునేందుకు ఐపిల్ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఫలితంగా దేశవాళీ క్రికెట్ ఆటగాళ్ల జీవితంలో ఐపిఎల్ వేలం పంట పండిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ యశశ్వి జైశ్వాల్‌ను రాజస్థాన్ రాయల్స్ (RR) రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేయడమే అందుకు ఓ చక్కటి ఉదాహరణ. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (203 పరుగులు) చేసిన జైశ్వాల్ అప్పుడే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. లక్నోలో ఆఫ్ఘనిస్థాన్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టులో జైశ్వాల్ చోటు దక్కించుకున్నాడు. జైశ్వాల్ ట్రాక్ రికార్డు చూసిన రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ.2.4 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది.

రవి బిష్నోయ్..
రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన రవి బిష్నోయ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. భారత జట్టు అండర్-19 ఆటగాడైన రవి బిష్నోయ్.. ప్రస్తుతం రాజస్తాన్ క్రికెట్ జట్టులో ఆడుతున్నాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫిలో రాజస్తాన్ తరపున లిస్ట్ ఏ జట్టులోనూ ఆడాడు. రవి బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతడిని రూ.2 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. 

ప్రియం గార్గ్..
దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్‌కు భారత్ తరపున సారథ్యం వహించనున్న ప్రియం గార్గ్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు అలాగే రూ.1.9 కోట్లకు వెచ్చించి సొంతం చేసుకుంది. బేస్ ప్రైస్ రూ.20 లక్షల ధరలో ఉన్న ప్రియం గార్గ్‌ను చేజిక్కించుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కూడా పోటీపడినప్పటికీ.. చివరికి ఎస్ఆర్‌హెచ్ అతడిని వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. రంజీల్లో ఉత్తరప్రదేశ్‌ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియం గార్గ్ గోవాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి అదరగొట్టడమే కాకుండా మొత్తం పది మ్యాచుల్లో 68 సగటుతో 814 పరుగులు చేసి జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కంట్లో పడ్డాడు. అలా అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం సొంతం చేసుకున్నాడు. 

విరాట్ సింగ్..
జార్ఖండ్ తరపున రంజీకి ఆడుతున్న విరాట్ సింగ్ బేస్ ప్రైస్ రూ.20 లక్షలు కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని రూ.1.90 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్‌లో 10 మ్యాచుల్లో 343 పరుగులు చేశాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలోనూ 7 మ్యాచుల్లో 335 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అందుకే విరాట్ సింగ్‌ని దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్ సైతం చివరి వరకు పోటీపడింది. 

కార్తిక్ త్యాగి..
రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కార్తీక్ త్యాగిది కూడా అటువంటి కహానీయే. రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.1.3 కోట్లకు త్యాగిని కైవసం చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌‌కే చెందిన కార్తిక్ త్యాగి జూలైలో ఇంగ్లండ్‌లో జరిగిన అండర్-19 ముక్కోణపు టోర్నీలో ఆడాడు. అంతకుముందుగా ఉత్తరప్రదేశ్‌ తరపున రంజీల్లో ఆడాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ముక్కోణపు టోర్నీలో ఐదు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి బౌలింగ్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు.

Trending News