సచిన్, కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డుని బ్రేక్ చేసిన మయాంక్ అగర్వాల్ ఎవరు ?

దేశీయ క్రికెట్‌లో తనదైన మార్కు ప్రదర్శనను కనబర్చిన మయాంక్ ప్రతీ ఫార్మాట్‌లో తనదైన ప్రతిభను చాటారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ల పేరిట ఉన్న రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు. 

Last Updated : Mar 17, 2018, 12:33 PM IST
సచిన్, కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డుని బ్రేక్ చేసిన మయాంక్ అగర్వాల్ ఎవరు ?

ప్రస్తుతం ఉన్న యువ క్రీడాకారుల్లో కర్ణాటకకు చెందిన యంగ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్న కుర్రాడు. దేశీయ క్రికెట్‌లో తనదైన మార్కు ప్రదర్శనను కనబర్చిన మయాంక్ ప్రతీ ఫార్మాట్‌లో తనదైన ప్రతిభను చాటారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ల పేరిట ఉన్న రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు. 2018లో జరిగిన విజయ్ హజారే టోర్నమెంట్‌లో కేవలం 8 మ్యాచ్‌ల్లో 723 పరుగులు చేశారు. అందులో 3 సెంచరీలు, 4 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అదే ట్రోఫీలో అన్ని పరుగులు చేయడం ద్వారా మయాంక్ లిస్ట్ ఏ సిరీస్‌లో సచిన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమించారు. అలాగే దేశీయ క్రికెట్‌లో 2000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు బ్రేక్ చేశారు.

మయాంక్ అగర్వాల్ 2017-18లో రంజీ ట్రోఫీలో 105.45 సగటున 1160 పరుగులు చేశారు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. అలాగే ముస్తక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌ల్లో 128 స్ట్రయిక్ రేటుతో 258 పరుగులు చేశాడు మయాంక్. అందులో 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

ఈ సందర్భంగా తాజాగా జీన్యూస్ ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూలో మయాంక్ అగర్వాల్ తన ఆలోచనలు పంచుకున్నారు.

సచిన్ నాకు ఆదర్శం:
మయాంక్ అగర్వాల్ తనకు లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయనే తనకు ఆదర్శమని అని చెప్పడం విశేషం. తనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే.. క్రికెట్ పట్ల ఆసక్తి ఏర్పడిందని.. వేసవి సెలవులలో తాను క్రికెట్ ఆడేవాడినని చెప్పిన మయాంక్.. తనకు క్రికెట్ పట్ల ఆసక్తి కలగడానికి కారణం సచిన్ అని చెప్పడం గమనార్హం. "అప్పుడప్పుడు సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నట్లు ఊహించుకొనేవాడిని. కానీ ఆ ఊహలే నిజమవుతాయని అనుకోలేదు. పాఠశాలలో వేసవి సెలవుల్లో ఆడిన క్రికెట్.. ఆ తర్వాత నా కెరీర్‌గా మారింది" అని మయాంక్ తెలిపారు.

10వ తరగతి తర్వాత..
ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలన్న ఆలోచన నాకు పదవ తరగతి పాసయ్యాక మాత్రమే కలిగింది. అప్పుడు నా వయసు 15-16 సంవత్సరాలు. కెరీర్‌గా ఏం ఎంచుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు.. నా మనసు క్రికెట్ వైపే మొగ్గు చూపింది.

కుటుంబ సహకారంతో..
తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు కుటుంబం నుండి పూర్తి మద్దతు లభించిందని అంటారు మాయంక్. మయాంక్ తండ్రి ఒక వ్యాపారవేత్త కాగా.. ఆయన తల్లి ఓ సాధారణ గృహిణి. తన కుటుంబం గురించి మయాంక్ మాట్లాడుతూ "నా కెరీర్‌కు సంబంధించి ప్రతీ దశలో నాకు నా కుటుంబం నుండి మద్దతు లభించింది. క్రికెట్ ఆడవద్దని నా తండ్రి నాకు ఎప్పుడూ చెప్పలేదు. పైగా వెన్నుతట్టి ప్రోత్సహించారు కూడా. ముఖ్యంగా ఎలాంటి రంగం వైపు వెళ్ళాలి.. ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనే సందేహం తలెత్తినప్పుడు చాలా రోజులపాటు నిద్ర లేకుండా గడిపాను. అసలు క్రికెటర్లకు ఉండే భవిష్యత్తు ఏమిటి అన్న విషయంపై కూడా భిన్నవాదనలు వినపడ్డాయి. అయినా నా మనసు చెప్పిందే విన్నాను. మీరు కూడా క్రికెట్‌పై ప్రేమ ఉండి.. ఒక మంచి క్రికెటర్‌గా ఎదగాలంటే.. అంకితభావంతో ఆడండి... కృషి చేస్తే మనం సాధించలేనిది అంటూ ఏమీ లేదు' అని మయంక్ అభిప్రాయపడ్డారు.

వీరేంద్ర సెహ్వాగ్ నా రోల్ మోడల్ :
సచిన్ టెండుల్కర్ నాకు ఆదర్శమైతే.. వీరేంద్ర సెహ్వాగ్ నా రోల్ మోడల్. "అప్పుడప్పడు ఆటలో ధైర్యం చేసి బ్యాట్స్‌మన్‌గా ఆధిపత్యాన్ని చూపించడంతో పాటు.. తనకంటూ ఒక స్టైల్‌ను ఏర్పాటు చేసుకోవడంలో వీరేంద్ర సెహ్వాగ్ సఫలం అయ్యారు. అందుకే నాకు ఆయన అంటే ఎంతో ఇష్టం" అని చెప్పి సెహ్వాగ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు మయాంక్. 

కేవలం టాలెంట్ మాత్రమే కనిపిస్తుంది.. ఫార్మాట్ కాదు:
రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఆడిన మయాంక్ తనకు క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కూడా ఇష్టమని తెలపడం విశేషం. మూడు ఫార్మాట్లను తాను ఎంజాయ్ చేస్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా ఒక ఆటగాడిగా తాను ప్రతీ సవాలును స్వీకరించాల్సి ఉంటుందని.. కనుకే సాధ్యమైనంత వరకు క్రికెట్‌ను అత్యుత్తమ స్థాయిలోనే ఆడేందుకు తాను ప్రయత్నిస్తానని మయాంక్ చెప్పారు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x