లీడ్స్: ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠరేపుతూ కొనసాగడమే కాకుండా క్రికెట్ ప్రియులను సస్పెన్స్‌కి గురిచేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌ని పాక్ 227 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 228 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేదించడం పాకిస్తాన్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని భావించినప్పటికీ.. పాక్ మాత్రం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నానా తిప్పలు పడింది. ఆప్ఘనిస్తాన్ బౌలర్లు పాకిస్తాన్ వికెట్స్ పడగొట్టిన తీరు చూసుకున్నా.. లేక రన్ రేట్ ప్రకారం చూసుకున్నా.. ఏ దశలోనూ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయే సూచనలు కనిపించలేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచేందుకు పాకిస్తాన్ చివరి వరకు పోరాడక తప్పలేదు. ఆఖరికి రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. లేదంటే పసికూన అనే పేరున్న జట్టు చేతిలో ఓటమి తప్పేది కాదు.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి పాలైనప్పటికీ.. ప్రత్యర్థికి తలొంచని తమ ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంది. అంతేకాకుండా హమ్ కిసీసే కమ్ నహీ అని ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిరూపించుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లలో రహ్మత్ షా (43 బంతుల్లో 35 పరుగులు ), అస్ఘర్ ఆఫ్ఘాన్ (35 బంతుల్లో 42 పరుగులు), నజీబుల్లా జద్రాన్ (54 బంతుల్లో 42 పరుగులు), ఇక్రం అలీ (66 బంతుల్లో 24 పరుగులు) మినహా మరెవ్వరూ పెద్దగా రాణించని కారణంగానే ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ అనంతరం 228 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 49.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పాకిస్తాన్ విజయంలో షాహీన్ అఫ్రిది, ఇమద్ వసీం కీలక పాత్ర పోషించారు. షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్స్ తీయగా తన బౌలింగ్‌లో మరో రెండు వికెట్స్ తీసిన ఇమద్ వసీం.. 54 బంతుల్లో 49 పరుగులు చేసి బ్యాట్‌తోనూ సమాధానం చెప్పాడు. మ్యాచ్ చివర్లో వసీం రాబట్టిన పరుగులే పాక్ విజయంలో కీలకం అవడం విశేషం.
ఆఫ్ఘనిస్తాన్‌పై పోరాడి గెలిచిన పాక్