ఇండియా vs వెస్ట్ ఇండీస్ : డాన్ బ్రాడ్‌మన్ తర్వాత విరాట్ కోహ్లీకే దక్కిన ఘనత

ఇండియా vs వెస్ట్ ఇండీస్: కోహ్లీకి మాత్రమే దక్కిన మరో రికార్డు

Updated: Oct 5, 2018, 03:38 PM IST
ఇండియా vs వెస్ట్ ఇండీస్ : డాన్ బ్రాడ్‌మన్ తర్వాత విరాట్ కోహ్లీకే దక్కిన ఘనత
File photo

టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ గర్జించడం మొదలుపెడితే, ప్రపంచంలో ఏ జట్టు బౌలర్ అయినా సరే అతడి ఆట ముందు తల వంచాల్సిందే. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్‌తో రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనూ అటువంటి సీనే రిపీట్ అయింది. నిన్న ప్రారంభమైన ఈ తొలి టెస్టులో 2వ రోజైన నేడు కోహ్లీ సెంచరీ పూర్తిచేశాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో ఇది 24వ సెంచరీ. టెస్ట్ కెరీర్‌లో వేగంగా 24 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్లలో ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత మళ్లీ ఆ ఘనత సొంతం చేసుకుంది విరాట్ కోహ్లీ ఒక్కడే కావడం విశేషం. 184 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 

66 ఇన్నింగ్స్‌లో డాన్ బ్రాడ్‌మన్ ఈ ఘనత సొంతం చేసుకోగా కోహ్లీ 123 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ అందుకోగలిగాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 125 ఇన్నింగ్స్, మాజీ కెప్టేన్ సునీల్ గవాస్కర్ 128 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్ అందుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వెస్ట్ ఇండీస్‌పై మాత్రం కోహ్లీకి ఇది 2వ టెస్ట్ సెంచరీ మాత్రమే. తొలి రోజు ఆటలో ఓపెనర్ పృథ్వీ షా సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.