What Happens To Facebook Account After User's Death: పెద్ద వాళ్లు చనిపోతే వారి ఆస్తిని అందరికీ వాటాలు వేసి పంచి ఇచ్చే విధంగా చట్టం వీలునామాను కనిపెట్టింది. వీలునామా అంటే ఎలా అంటే.. ఒక్కసారి చట్టబద్ధంగా వీలునామా రాసిచ్చాకా.. ఆ మనిషి మన మధ్య బతికి లేకపోయినా ఆ పేపర్లు అతడి మాటల్ని చెప్పినట్టే.. మరి మనిషి చనిపోయాకా వారి సోషల్ మీడియా ఖాతాల పరిస్థితి ఏంటి ? అన్ని సోషల్ మీడియా ఖాతాల సంగతిని కాసేపు పక్కనపెడితే.. ఉదాహరణకు ఫేస్ బుక్ ఖాతానే తీసుకుందాం .. మనిషి చనిపోయాకా ఫేస్‌బుక్ ఖాతా ఏమవుతుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ క్రమం తప్పకుండా పోస్టులు పెట్టే వారిని ఈ ప్రశ్న మరింత ఎక్కువగా వేధిస్తోందట.
ఆజ్ కల్ కా జమానా బదల్ గయా.. ఇప్పుడు మనిషికి అనుభవించేందుకు భౌతిక ఆస్తులు మాత్రమే కాదు.. ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో మనిషికి విడదీయలేని అనుబంధం అల్లుకుపోయింది. ఎంతలా అంటే.. రోజూ పొద్దున్నే లేవడంతోనే మొదలుపెడితే... రాత్రి పడుకునే వరకు లెక్కలేనన్నిసార్లు అందులో తలదూర్చడం ఒక పరిపాటిగా మారిపోయేంతగా.. ఇంకా చెప్పాలంటే.. రోజూ ఉదయం వాటితోనే మొదలవుతోంది.. రాత్రి పడుకునే ముందు ఆ రోజు కూడా వాటితోనే ముగుస్తోంది.
అయితే, న్యూస్18 వెల్లడించిన ఒక కథనం ప్రకారం ఫేస్‌బుక్ యూజర్ చనిపోతే.. ఆ తరువాత వారి ఖాతాను, ఖాతాలోని ఫోటోలు, వీడియోలతో పాటు అన్ని పోస్టులను డిలీట్ చేసే విధంగా ఫేస్‌బుక్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఒక వ్యక్తి చనిపోయినట్టుగా ఫేస్‌బుక్ యాజమాన్యానికి తగిన ఆధారాలతో సమాచారం అందిస్తే మిగతా పని వారే చూసుకుంటారు. ఒకవేళ చనిపోయిన వారి ఫేస్‌బుక్ ఖాతాలను ఫేస్‌బుక్ కానీ క్లోజ్ చేసినట్టయితే.. బతికి ఉన్న వారు ఎవ్వరూ కూడా చనిపోయిన వారి ఖాతాలను మిస్‌యూజ్ చేసే అవకాశం కూడా ఉండదు.
అంతేకాకుండా మెమొరియలైజ్డ్ ప్రొఫైల్ అనే మరో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఎంచుకున్నట్టయితే.. చనిపోయిన తరువాత వారి బంధుమిత్రులు చనిపోయిన వారి ప్రొఫైల్ వేదికగా వారితో ఉన్న తమ జ్ఞాపకాలను, అనుబంధాన్ని నెమరేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే, ఇక్కడ కూడా చనిపోయిన వారి ఫేస్ బుక్ ఖాతా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వారి ఖాతాను శాశ్వతంగా ఎవ్వరూ లాగిన్ అవడానికి వీల్లేకుండా ఫేస్‌బుక్ డిసేబుల్ చేసి పెట్టేస్తుంది.