'కేసీఆర్‌ ఫ్రంట్‌ ఆషామాషీగా ఉండదు'

కేసీఆర్‌ ఫ్రంట్‌ అంటే ఆషామాషీగా ఉండదని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.

Last Updated : Apr 28, 2018, 05:46 PM IST
'కేసీఆర్‌ ఫ్రంట్‌ ఆషామాషీగా ఉండదు'

కేసీఆర్‌ ఫ్రంట్‌ అంటే ఆషామాషీగా ఉండదని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ వేదికగా కేసీఆర్ శుక్రవారం (ఏప్రిల్ 27) దేశ రాజకీయాలపై కేసీఆర్ సమర శంఖం పూరించారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో గుణాత్మకమార్పు తీసుకొచ్చేందుకు దేశమంతటా పర్యటిస్తా. క్రియాశీల పాత్ర పోషిస్తా' అని ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వస్తే స్కీంల పేర్లు.. స్కాంల పద్దతులు మారడం తప్ప ప్రజల జీవనవిధానంలో మార్పేమీ ఉండదని అన్నారు. 'తెలంగాణ వచ్చాక ఇక్కడి వారు వజ్రాల్లా మారిండ్రు. అలా అని నేను హైదరాబాద్ వదిలి ఢిల్లీ పోతా అనుకొనేరు. ఇక్కడి నుండే ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా' అన్నారు.

తెలంగాణ నుంచే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, భారత ఆత్మ గౌరవ బావుటా ఎగరేస్తా అని కేసీఆర్ ప్లీనరీ వేదికగా అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్/థర్డ్ ఫ్రంట్‌పై ప్రసంగించారు. కేసీఆర్‌ ఫ్రంట్‌ అంటే ఆషామాషీగా ఉండదని చెప్పారు. ఇప్పటికే డీఎంకే ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు వచ్చి కలిసిందని చెప్పారు. ఏప్రిల్ 29న పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావుతో కలిసి చెన్నై వెళ్ళి స్టాలిన్‌తో చర్చలు జరుపుతామని కేసీఆర్ అన్నారు. మే 2న ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌ వస్తున్నారని.. ఆయనతో కూడా భేటీ కాబోతున్నట్లు చెప్పారు.

Trending News