మాదిగ రిజర్వేషన్ పార్టీ నేత మందకృష్ణ మాదిగ సమర్పించిన బెయిన్ పిటీషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అయితే ఇదే కేసులో మందకృష్ణతో పాటు పిటీషన్ పెట్టుకున్న మరో అయిదుగురికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఈ అంశంపై మందకృష్ణ మాట్లాడుతూ, మళ్లీ బెయిల్ కోసం జిల్లా కోర్టులో అపీల్ చేస్తామని తెలియజేశారు. ముందస్తు అనుమతులు లేకుండా దీక్షలకు కూర్చోవడంతో పాటు యువతను రెచ్చగొట్టే విధంగా కుల ప్రసంగాలు చేశారనే కారణంతో ఆయనను పోలీస్ శాఖ అదుపులోకి తీసుకోవడం జరగింది.
ఈ నెల 2వ తేదిన ఈయనను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇటీవలే మందకృష్ణ మాదిగను గుజరాత్ ఎమ్మెల్యే మరియు దళిత నేత జిగ్నేష్ మెవానీ హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసిన విషయం తెలిసిందే. మాదిగలకు పెద్దకొడుకుగా ఉంటానన్న చంద్రబాబు ఆ కులస్థులకు ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని గతంలో మందకృష్ణ విమర్శించారు. అలాగే గిరిజన ప్రాంతాలలో వాల్మీకులుగా మాలలు గిరిజన ఫలాలను దక్కించుకుంటున్నపుడు, మాదిగలను కొండ మాదిగలుగా సర్కారు ఎందుకు గుర్తించదని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.