Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్... ఆలోపు హామీలను నెరవేర్చకపోతే...

Bandi Sanjay letter to CM KCR: కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పండగ పూట కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకునే దుస్థితి తలెత్తిందని బండి సంజయ్ అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 04:39 PM IST
 Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ డెడ్‌లైన్... ఆలోపు హామీలను నెరవేర్చకపోతే...

Bandi Sanjay letter to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత తరుపున బీజేపీ పోరాడుతున్నందునా... ఆ పోరాటాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఈ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందని.. ఆ భయంతోనే జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. పండగ పూట కన్నీళ్లతో సకినాల పిండిని తడుపుకునే దుస్థితి తలెత్తిందని బండి సంజయ్ అన్నారు. గతంలో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రూ.1లక్ష రుణమాఫీ అమలుచేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు ఒక్కో క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించాలన్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో తక్షణమే రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీని అమలుచేయడంతో పాటు పాలీహౌజ్ సబ్సిడీని వెంటనే పునరుద్ధరించాలన్నారు. అలాగే విత్తన సబ్సిడీని పూర్తిగా అమలుచేయాలని.. నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రాష్ట్రంలో అమలుచేయాలన్నారు. అకాల వర్షాలకు నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు 'క్రాప్ ఇన్సూరెన్స్' పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ అమలుచేయాలన్నారు. ఉగాది నాటికి ఈ హామీలు, డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. లేనిపక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Trending News