Nalgonda KCR Speech: 'నా చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడుతా. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ' అని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండు నెలల ప్రభుత్వంతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగంతో కేసీఆర్ గులాబీ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు.
Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు.. కేటీఆర్, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి
కేసీఆర్ ప్రసంగం ఇలా.. 'ఇది రాజకీయ సభ కాదు. ఉద్యమ సభ. పోరాట సభ. కాలు విరిగినా కట్టె పట్టుకుని నల్లగొండకు వచ్చా. ఫ్లోరైడ్ వల్ల నల్లగొండ ప్రజల నడుములు వొంగిపోతే ఆనాడు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని టేబుల్‌పై చూపించాం. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్ సమస్య పోయింది. ఇప్పుడు నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి రాష్ట్రం తీసుకువచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు. పాలిచ్చే బర్రెని అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు' అని తెలిపారు.
Also Read: KTR Viral Tweet: శభాష్ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్ ప్రశంసలు
'బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యింది. డిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు-రంగరాఎడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రెబ్యునల్ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా. పిల్లి మాదిరిగా ఉండను. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చేతకాదు' అని గులాబీ అధినేత కేసీఆర్ విమర్శించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు పాస్ అవ్వాలి.. ఆటంకం కాకూడదని ఒక్క సంవత్సరం కోసం తాత్కాలిక నీటి ఒప్పందానికి అంగీకరించాం. తర్వాత మన నీళ్ల కోసం ట్రిబ్యునల్ వెయ్యమని మోడీ ప్రభుత్వానికి వందల లేఖలు రాసినం. పార్లమెంటులో కొట్లాడినం. బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేశారు' అని గుర్తు చేశారు.
గతంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన 'చెప్పు' వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తూ.. 'రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా.. ఎన్ని గుండెల్రా మీకు?. రైతుబంధు వేయడానికి చేతకాకపోతే కుదరదు. ఇప్పుడు కాదు నెమ్మదిగా వేస్తాం. కానీ రైతులను తిడతారా. రైతుల కాడ ఎట్లాంటి చెప్పులు ఉంటాయో తెలుసా. వాళ్ల చెప్పులతో కొడితే మూడు పళ్లు ఊడతాయి' అని హెచ్చరించారు. 'కేసీఆర్‌ను బద్నాం చెయ్యాలన్నదే ఎజెండాగా పెట్టుకొని.. రైతులను ఎండగొడ్తారా?. దమ్ముంటే, చేతనైతే నీళ్లు ఎత్తిపోయ్' అని సవాల్ విసిరారు. సీఎం, మంత్రుల మేడిగడ్డను తప్పుబట్టారు. 'మేడిగడ్డ, బొందలగడ్డ కాడికి పోయి ఏం చేస్తారు?' అని నిలదీశారు. 'కేసీఆర్‌ని తిడితే, బద్నాం చేస్తే పెద్దోళ్ళు అయితరా?' అని ప్రశ్నించారు.
కేఆర్‌ఎంబీ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ కీలక సూచన చేశారు. 'నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, మన నీళ్లు దొబ్బిపోదామని చూస్తున్న స్వార్థశక్తులకు ఈ ఛలో నల్గొండ సభ ఒక హెచ్చరిక. కేఆర్‌ఎంబీ అంశంపై అన్ని పార్టీలను ఢిల్లీ తీసుకెళ్లి సమావేశం పెట్టాలి' అని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన నీటి కొరత, విద్యుత్ అంతరాయంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 'చేతకాని చవట దద్దమ్మలు పాలిస్తుంటే కరెంట్ ఎందుకు ఉంటది' అని మండిపడ్డారు.'అధికారం శాశ్వతం కాదు. మన హక్కులు శాశ్వతం.. మన వాటా శాశ్వతం. మన హక్కులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం. వాటికోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుది' అని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook