Budida Bikshamaiah Goud: బీజేపికి బూడిద భిక్షమయ్య గౌడ్ గుడ్ బై.. పార్టీపై సంచలన ఆరోపణలు

Budida Bikshamaiah Goud: మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ బీజేపిలో చేరగా.. తాజాగా అదే బీజేపి నుండి అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపికి గుడ్ బై చెప్పారు. 

Written by - Pavan | Last Updated : Oct 20, 2022, 02:55 PM IST
  • బీజేపికి గుడ్ బై చెప్పిన బూడిద భిక్షమయ్య గౌడ్
  • తెలంగాణపై బీజేపి చిత్తశుద్ధి లేదనడానికి ఆ ఒక్క మాట చాలన్న భిక్షమయ్య గౌడ్
  • గౌడ కుల నాయకులను రాజకీయంగా సమాధి చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్..
Budida Bikshamaiah Goud: బీజేపికి బూడిద భిక్షమయ్య గౌడ్ గుడ్ బై.. పార్టీపై సంచలన ఆరోపణలు

Budida Bikshamaiah Goud Resigns BJP: మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇంత కాలం పాటు సొంత పార్టీలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు తమ పార్టీలను వీడి మరొక పార్టీలో చేరే పనిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాంరాం చెప్పి బీజేలో చేరారు. దీంతో బూర నర్సయ్య గౌడ్ రాకతో మునుగోడులో కొంతమేరకు గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను దండుకోవచ్చని బీజేపి సంబరపడింది. బూర నర్సయ్య గౌడ్ రాక బీజేపికి ఎంతో కొంత బలాన్నిస్తుందని భావించింది. కానీ ఇంతలోనే అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెబుతూ ఆ పార్టీపై పలు సంచలన ఆరోపణలు చేయడం చర్చనియాంశమైంది. 

అందుకే బయటికొచ్చేశా..
తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు బీజేపి చేస్తోన్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూసి సహించలేకే ఆ పార్టీ నుండి బయటికొస్తున్నట్టు బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించిన బూడిద భిక్షమయ్య గౌడ్.. బీజేపిపై, ఆ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని బీజేపి హామీ ఇచ్చిందనే కారణంతోనే ఆ పార్టీలో చేరాను కానీ అది నిజం కాదని ఆ తర్వాత కొద్దిరోజులకే అర్థమైందని అన్నారు. మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న తనకు బీజేపిలో చేరినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురవుతూ వచ్చాయన్నారు. పార్టీలో తన లాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారు లేకపోగా.. ఇటీవల కాలంలో బీసీలకు అన్యాయం జరిగేలా ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు తన మనసుకు బాధ కలిగించాని ఆవేదన వ్యక్తంచేశారు.. 

తెలంగాణపై బీజేపి చిత్తశుద్ధి ఏంటో చెప్పడానికి ఆ ఒక్క మాట చాలు
ప్రధాన మంత్రి నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రుల వరకు తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తెలంగాణకు సాయం చేయకపోవడం చూస్తే.. తెలంగాణ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో ఉంటేనే నిధులిస్తాము, అప్పటి వరకు తెలంగాణలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోం అన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని బీజేపిపై అసహనం వ్యక్తంచేశారు. 

బీసీలకు ఇంకెక్కడి సంక్షేమం ?
బీసీల సంక్షేమం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ప్రత్యేకంగా బలహీనవర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశించిన తనకు ఆ విషయంలో కూడా నిరాశే ఎదురైంది. అలాగే చేనేత కార్మికులకు జీవనాధారమైన చేనేత రంగానికి సైతం జీఎస్టీ వర్తింపచేయడమే కాకుండా.. ఆ పన్ను భారాన్ని తొలగించాల్సిందిగా చేనేత కార్మికులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని బూడిద భిక్షమయ్య గౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతో మంది చేనేత కార్మికులు ఇబ్బందలు పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

గౌడ కుల నాయకులను రాజకీయంగా సమాధి చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతల రాజకీయ భవిష్యత్తును రాజకీయంగా సమాధి చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని భారతీయ జనతా పార్టీ బీసీల మనోభావాలను దెబ్బ తీసిందని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ తో వేగలేకే తాను పార్టీ మారాల్సి వచ్చిందని.. అలాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపిలో చేర్చుకోవడం తనను మనోవేధనకు గురిచేసిందని.. అందువల్లే తాను బీజేపికి గుడ్ బై చెబుతున్నానంటూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇవేకాకుండా తెలంగాణలో ఉన్న పలు ఇతర ప్రజా సమస్యలను ఏకరువు పెట్టిన బూడిద భిక్షమయ్య గౌడ్.. ఆ సమస్యల పరిష్కారం కోసం బీజేపి కృషిచేయకపోగా.. కనీసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాలేదని అభిప్రాయపడటం కొసమెరుపు. మొత్తానికి బీజేపిలో చేరడానికి ముందు టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పిన బూడిద భిక్షమయ్య గౌడ్.. తాజాగా బీజేపికి గుడ్ బై చెబుతూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Also Read : Munugode Bypoll Symbol: మునుగోడులో టీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రోడ్డు రోలర్ గుర్తుపై సీఈసీ సంచలనం

Also Read : Munugode Bypoll: బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో కలకలం

Also Read : Munugode Bypoll: నిద్రలేని రాత్రులు గడుపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News