CM Revanth Reddy: తెలంగాణ బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు జారీ

CM Revanth Reddy Review Meeting: తెలంగాణ బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 08:54 PM IST
CM Revanth Reddy: తెలంగాణ బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు జారీ

CM Revanth Reddy Review Meeting: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృథా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. బుధవారం డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత? ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని అన్నారు. 

ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు. గతంలో అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని కోరారు. 

తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలువకముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News