CM Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌పై చెలరేగిన సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఎప్పుడైనా రెడీ..!

CM Revanth Reddy Speech in Assembly: మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్ రేస్ వ్యవహారంపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 20, 2024, 05:04 PM IST
CM Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌పై చెలరేగిన సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఎప్పుడైనా రెడీ..!

CM Revanth Reddy Speech in Assembly: అర్హులైన ప్రతీ భూ యజమానులు హక్కులు కాపాడేందుకు చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావలని భావించామన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందని విమర్శించారు. రావి నారాయణ రెడ్డి, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి, మల్లు స్వరాజ్యం, భీం రెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ లాంటి వారు పోరాటాలు చేసింది భూమి కోసమేనని అన్నారు. ఈ భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారని గుర్తు చేశారు. అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చెలాయించాలని చూసినా భూమిని కాపాడుకోవడంలో వారు విజయం సాధించారని అన్నారు.

"యజమాని హక్కులను కాపాడేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ గారు పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడాలి. లేకపోతే చదువులేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా చట్టాలు సవరించాయి. తన మెదడును రంగరించి మాజీ సీఎం కేసీఆర్ ఒక అద్భుత చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో చెప్పారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదు. 2010లోనే ఒడిస్సాలో  ఈ-ధరణి పేరుతో IL&FS కంపెనీకి అప్పగించింది. అనుభవం, నైపుణ్యం  లేని సంస్థకు  ఈ-ధరణి పోర్టల్ ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టింది.

అలాంటి లోపభూయిష్టమైన ధరణిని కేసీఆర్ ఎందుకు తెలంగాణ ప్రజలపై రుద్దారో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. 2018లో IL&FS తో పాటు గాదె శ్రీధర్‌కు చెందిన e centric, wissen infotech సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి. క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లలో నిషేధించే విధానం ఉంది.. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదు. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలు ఆ కంపెనీకి అప్పగించారు. ఆ తరువాత IL&FS సబ్సిడరీ కంపెనీ అయిన టెరాసిస్  ధరణి కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ టెర్రాసిస్‌లో 99 శాతం షేర్లు ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన Falcon SG అనే సంస్థ రెండు దఫాలుగా 2021 లో కొనుగోలు చేసింది. మిగిలిన ఒక్క శాతం వాటా మాత్రం కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు కొనుగోలు చేశారు. ఆ ఒక్క శాతం షేరుతో శ్రీధర్ రాజు టెరాసిస్‌కు సీఈవోగా అవతారం ఎత్తారు. 

రెవెన్యూ డిపార్ట్ మెంట్, భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. ఇతర దేశాల్లో ఆర్ధిక నేరాల్లో ఇరుక్కుపోయిన సంస్థలకు అప్పగించి.. రైతుల సంపూర్ణ డేటాను వాళ్ల చేతుల్లో పెట్టారు. ఇది ఎంత తీవ్రమైన నేరమో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలకు ద్రోహం చేసి, మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎంసీహెచ్ఆర్డీలో అద్భుతమైన సాంకేతిక ఉంది..ఇతర రాష్ట్రాలకు మన సాంకేతికతను అందిస్తున్న పరిస్థితుల్లో వీళ్లు విదేశీ కంపెనీలకు అప్పగించారు. 

కేసీఆర్  ఆవేశంతో ఊగిపోతుంటే ఆనాడు నాకు అర్ధం కాలేదు. ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్ భూములు, ప్రయివేట్ భూముల యజమానుల పేర్లు మారాయి. అగ్రిమెంట్ లోని 9.20 క్లాజ్ ప్రకారం యజమాని పేరు మార్చడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 9.20.4 క్లాజ్ లో పేర్కొన్నట్లు ప్రభుత్వ ఆఫీసులో ఉండి పనులు చేయాలి. రెవెన్యూ శాఖకు సంబంధించిన సీసీఎల్ఏ కార్యాలయం నుంచి పని చేయాలి. తెలంగాణలో కాకుండా విజయవాడలో, బెంగుళూరుకు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ధరణిని నిర్వహించారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేని కంపెనీలకు, విదేశీయులకు అప్పగించి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు. దీనిపై ఎంత కఠినమైన శిక్ష  వేయాల్సిన అవసరం ఉందో ఆలోచన చేయాలి. 

గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఆ వ్యక్తికి తెలియకుండా ఎవరికీ ఇవ్వొద్దని చట్టాలు చెబుతున్నాయి. కానీ కేసీఆర్, కేటీఆర్ ఇతర దేశాల వ్యక్తులకు ఈ సమాచారం అప్పగించారు. ఇంత ఎంత తీవ్రమైన నేరం..? ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చాలా సమావేశాలు నిర్వహించి భూ భారతి చట్టాన్ని సభ ముందుకు తీసుకొచ్చింది. ధరణిలో పగలు జరగాల్సిన రిజిస్ట్రేషన్లు అర్ధరాత్రి కూడా జరిగాయి. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసే వ్యవస్థ ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? బండారం బయటపడుతుందనే ఇవాళ చర్చ జరగకుండా ప్రయత్నాలు చేశారు.

ఆనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా.. లెక్కచేయకుండా తిమ్మాపూర్ భూదాన్ భూములను ప్రయివేట్ వ్యక్తుల పేరుకు మార్చారు.. మా ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదు చేశాము. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను బదిలీ చేశారు. ఎక్కడి నుంచైనా, ఏ పేరుకైనా మార్చేలా స్వైర విహారంచేసే అధికారం సంస్థకు అప్పగించారు. ధరణి అద్భుతమైతే సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా..? 80 వేల పుస్తకాల జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సంపూర్ణంగా వివరించచ్చు కదా.. ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగొద్దని తొండి చేయాలని ప్రయత్నించి  వెళ్లిపోయారు..

ఈ కార్ రేస్ సంస్థకు చెందిన వ్యక్తి అపాయింట్‌మెంట్ అడిగితే నేనే ఇచ్చా.. వారు చెప్పాకే వ్యవహారం ఏంటనేది అధికారులతో తెలుసుకున్నా.. ఏసీబీ విచారణ చేస్తున్న సమయంలో, కోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో విచారణాధికారులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అడ్వాంటేజ్ తీసుకుంటారని దీనిపై ఎక్కువ మాట్లాడటంలేదు. 2023 డిసెంబర్ నుంచి 2024 వరకు జరిగిన అన్ని వివరాలను ప్రజలకు అందిస్తా. ఈ కార్ రేస్‌పై ఏడాదిగా చర్చ జరుగుతున్నా.. అసెంబ్లీలో నాలుగు సమావేశాల్లో ఎప్పుడైనా దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? నిన్నటి నుంచి చర్చ జరగాల్సిందే అని పట్టుబడుతున్నారు.. ఎందుకీ అహంకారం..?

ఏడాదిగా అవసరంలేని చర్చ ధరణి గురించి చర్చ వచ్చిప్పుడే ఎందుకు..? కుట్రపూరిత ఆలోచనతోనే చర్చ జరగకూడదని ప్రయత్నించారు. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి ఎప్పుడు పిలిచినా ఇక్కడైనా, ఎక్కడైనా.. చివరకు వాళ్ల పార్టీ ఆఫీసులోనైన చర్చకు సిద్దం.. రూ.55 కోట్లు చిన్న అమౌంటా? మేం ఒప్పుకోకపోవడం వల్లే  ప్రభుత్వం రూ.600 కోట్ల నష్టపోకుండా ఆపగలిగాం.. డ్రగ్స్‌తో పట్టుబడితే ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని దబాయిస్తున్నారు.. మనం ఏ సాంప్రదాయంలో ఉన్నాం.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామనే తీరుగా బీఆరెస్ ప్రవర్తన ఉంది. దీన్ని ప్రభుత్వం ఏ మాత్రం సహించదు..

మీరు కూడా కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చినట్టుంది అధ్యక్షా.. హరీష్ రావు పరిస్థితి మాకు అర్ధమైంది.. చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి. ప్రజల కోసం  కొన్ని కొరడా దెబ్బలు తినాలి..మరీ మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదు. పేదల భూ హక్కులను కాపాడేందుకే భూ భారతి-2024." అని రేవంత్ రెడ్డి అన్నారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x