నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీ వీడి టీఆర్ఎస్‌లో చేరడంతో తగిలిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే టి కాంగ్రెస్‌కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడో రేపో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి చొరవ తీసుకుని చిరుమర్తి లింగయ్యతో సంప్రదింపులు జరిపారనేది సదరు వార్తా కథనాల సారాంశం. మరోవైపు చిరుమర్తి లింగయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, తాను టీఆర్ఎస్‌లో చేరడానికి ముందు కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ తనను సంప్రదించడానికి వీల్లేకుండా ఆయన తన ఫోన్ సైతం స్విచ్‌ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది.
ఒకవేళ చిరుమర్తి లింగయ్య కానీ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టయితే, అది ఆ పార్టీకే కాకుండా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు సైతం షాక్ ఇచ్చే పరిణామమే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కోమటిరెడ్డి వర్గానికి ప్రధాన అనుచరుడిగా చిరుమర్తి లింగయ్యకు పేరుంది. ఒకానొక దశలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరుమర్తి లింగయ్యకు పార్టీ టిక్కెట్ ఇస్తుందో లేదోననే సందేహాలు వ్యక్తమైనప్పుడు కోమటి రెడ్డి బ్రదర్సే పట్టుపట్టి మరీ అధిష్టానం నుంచి చిరుమర్తికి టిక్కెట్ ఇప్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో చిరుమర్తి పార్టీ మారితే అది పార్టీకే కాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్‌ని సైతం దెబ్బ తీసినట్టే అవుతుందనే చర్చలు వినిపిస్తున్నాయి.