MLC Jeevan Reddy: ఓటుతో పాటు నోటు అంటున్న జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy Comments on Vote and Note: శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి జరుగుతున్న క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాలనీ వాసుల్లో నవ్వులు పూయించాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 08:51 AM IST
MLC Jeevan Reddy: ఓటుతో పాటు నోటు అంటున్న జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy Comments on Vote and Note: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి నోట ఓటుకు నోటు అనే మాటలు రావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఓవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు జీవన్ రెడ్డి నోట ఓటుకు నోటు అనే మాట రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాటలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నమాటలు కాదండోయ్… ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి గురించే జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇంతకీ ఆయన నోట వచ్చిన ఈ వ్యాఖ్యలకు కారణమేంటంటో తెలుసుకుందాం రండి.

శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి జరుగుతున్న క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాలనీ వాసుల్లో నవ్వులు పూయించాయి. 

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, " వచ్చే ఎన్నికల్లో జనం తనకు ఓటు వేయడంతో పాటు నోటు కూడా ఇవ్వాలి " అని స్థానికులను అభ్యర్థించారు. జీవన్ రెడ్డి మాటలు విన్న జనం.. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అయోమయంలో పడ్డారు. జీవన్ రెడ్డి సరిగ్గానే మాట్లాడుతున్నారా లేక తామే ఏమైనా పొరపడుతున్నామా అన్నట్టుగా ముఖాలు పెట్టి వినసాగారు. అంతలోనే జీవన్ రెడ్డి అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. ఓటుతో పాటు నూరు రూపాయలు కూడా ఇవ్వాలని వారిని కోరుతున్నానని, ఒక్క రోజుకు తాగుడుకు పెట్టే ఖర్చు తనకు ఇవ్వాలని కోరారు. అప్పుడు కానీ జీవన్ రెడ్డి మాటల్లోని అర్థానికి పరమార్థం ఏంటో జనానికి తెలిసి రాలేదు. అసలు విషయం బోధపడ్డాకా జనం నుంచి నవ్వే సమాధానం అయింది. 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాటలతో కొంతమంది స్థానికులు ఏకీభవించగా.. లిక్కర్ గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ గురించి తెలిసి ఇంకొందరు ఛలోక్తులు విసురుతున్నారు. ఏంటీ జీవన్ రెడ్డి సాబ్‌కు లిక్కర్ రేట్లు కూడా తెలుస్తలేవా ? ఒక్క రోజు మందు తాగేందుకు రూ. వందే సరిపోతాయా ? ఆ డబ్బులతో క్వార్టర్ కూడా రాదు కదా అని పెరిగిన మద్యం ధరలపై సెటైర్లు వేసుకుంటూ నవ్వుకున్న వారు కూడా లేకపోలేదు. 

ఓ వైపున మద్యం అమ్మకాల మీదనే తెలంగాణ సర్కర్ నడుస్తోందని విమర్శించే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాటి ధరలు ఎంత పెరిగాయో కూడా తెలియదా అని కొందరు కామెంట్ చేస్తుంటే... పెద్దాయన జీవన్ రెడ్డి సాబ్‌కు మద్యం అలవాటు లేదు కావచ్చు అందుకే ధరలు కూడా తెలియడం లేదనే కామెంట్స్ వినిపించాయి. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి నిత్యం జగిత్యాల ప్రజల మధ్య ఉంటూ తన పట్టు బిగించే పనిలో నిమగ్నం అయ్యారు. టీఆర్ నగర్‌లో ఆయన చేసిన ఓటుతో పాటు నోటు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

Trending News