Cyberabad CP Sajjanar on Lockdown in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం ఉదయం 10 నుండి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండనుండగా.. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే వారు లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్ వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించిన అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గతేడాది లాక్డౌన్ విధించినప్పుడు అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. కానీ ఈసారి ప్రజలకు లాక్డౌన్పై (Lockdown 2021) ఓ అవగాహన వచ్చిందని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విషయంలో పోలీసులకు సహకరిస్తున్నారని సీపీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అత్యవసర పనులపై వెళ్లే వారు మాత్రమే రోడ్లపైకి వస్తున్నారు అని వ్యాఖ్యానించిన సజ్జనార్.. పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) నుండి సురక్షితంగా బయటపడతామని అన్నారు.