Eetala Rajender Speech: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు దమ్ముంటే తాను అసెంబ్లీ సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని సవాల్ విసిరారు బీజేపి నేత ఈటల రాజేందర్. గడిచిన 8 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అయినా ఇచ్చారా ? అని అడిగినందుకు నాకే కళ్ళు కనిపించడం లేదు అని ప్రత్యారోపణలు చేస్తున్నారు. మీరు జగద్గిరిగుట్టకు ఎవరికి కంటి పరీక్షలు చేయించాలో ఇక్కడి ప్రజలను అడుగుదాం అని అధికార పార్టీ నేతలపై ఈటల రాజేందర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగద్గిరిగుట్టలో బుధవారం జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్.. అధికార పార్టీ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలబడాల్సిన స్పీకర్ కూడా అధికార పార్టీ పక్షమే పనిచేస్తున్నారు అని మండిపడ్డారు. ఇళ్లల్లో పని చేసి తల్లి కష్టపడి పిల్లలని చదివిపిస్తే.. వారికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఒకవేళ ఉద్యోగాలు వచ్చినా.. అవి కూడా లిఫ్ట్ బాయ్ స్థాయి ఉద్యోగాలే తప్ప పెద్ద ఉద్యోగాలు ఏవీ యువతకు దిక్కు లేవు. కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో పుస్తెలతాళ్ళు కట్టడానికి కేసీఆర్ ఇచ్చే డబ్బులు మూడు వేల కోట్లు అయితే.. మళ్లీ అదే పుస్తెలను తెంపి కేసీఆర్ 45 వేల కోట్లు సంపాదిస్తుండు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రైతుబందు పథకం సేద్యం చేసే రైతులకు చెందాలి. కానీ ధనికులు కట్టుకున్న ఫామ్ హౌజ్‌లకి కూడా కేసీఆర్ రైతుబందు పేరిట డబ్బులు ఇస్తున్నాడు. అలా ఫామ్ హౌజులకు రైతు బందు ఇవ్వడానికి అది రాజుల సొమ్ము కాదు కేసీఆర్.. పేదలు చెమటోడ్చి సంపాదించి కట్టిన ప్రజాధనం అని ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయిందన్న చందంగా పేదలకు కేసీఆర్ భూములు ఇవ్వకపోగా.. గతంలో ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా వెనక్కి లాక్కొని రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారు అని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ చెప్పేమాటలకు చేసే పనులకు పొంతనే లేదని ఆరోపించిన ఈటల రాజేందర్.. మహిళలకి కేసీఆర్ 4200 కోట్ల రూపాయలు వడ్డీ బాకీ ఉన్నాడని అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చాడు మళ్లీ ఇవ్వడం లేదని గుర్తుచేశారు. ప్రజలు ఆశీర్వదించి, వారి ప్రేమతో బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపిస్తాం. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించే జిమ్మేదార్ మేం తీసుకుంటాం అని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా మాదే అని ఈటల రాజేందర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఖుత్భుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపి నేత కూన శ్రీశైలం గౌడ్ కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : YS Sharmila: తెలంగాణలో హిజ్రాలు ఆందోళన.. వైఎస్ షర్మిల క్షమాపణలు
ఇది కూడా చదవండి : Prostitution Racket: సర్పంచ్ ఫామ్‌హౌజ్‌లో హైటెక్ వ్యభిచారం ?.. ప్రజాప్రతినిధి కూడా ఉన్నాడా ?
ఇది కూడా చదవండి : Revanth Reddy: రూ.500లకే గ్యాస్ సిలిండర్.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి హామీల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
యాపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook