హైదరాబాద్: గతంలో తనను చాలామంది మోసం చేశారని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే ఆయన తనకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నారు కానీ కొంతమంది అడ్డుపడటం వల్లే అది సాధ్యపడలేదని చెప్పారు. తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినా కలగని ఆనందం ఇప్పుడు కలుగుతోందని చెబుతూ.. తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పజెప్పారని, ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి గ్రామ పంచాయతీలను అభివృద్ధిపథంలో నడిపేందుకు తన వంతు కృషిచేస్తానని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.