Honor Killing Attempt In Hyderabad : హైదరాబాద్‌లో మరో పరువు హత్యకు జరిగిన ప్రయత్నం విఫలమయ్యింది. ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జరిగిందీ సంఘటన. 20 రోజుల వ్యవధిలోనే రెండు పరువు హత్యలు ప్రకంపనలు సృష్టించగా మళ్లీ ఇదే తరహా సంఘటనకు ప్లాన్ జరగడం నగర వాసులను వణికించింది. సాయికిరణ్, అనే వ్యక్తి తన స్నేహితునితో కలిసి రంగారెడ్డి జిల్లా కోర్టులోకి కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే, కోర్టులోపలికి వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది సాధారణంగానే తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సాయికిరణ్ నడుమువద్ద కత్తి ఉన్న ఆనవాళ్లు గుర్తించారు. వెంటనే సోదాలు చేయగా కత్తి బయటపడింది. దీంతో, కోర్టు సెక్యూరిటీ సిబ్బంది సాయికిరణ్‌తో పాటు.. మరో యువకుడిని ఎల్‌బీనగర్ పోలీసులకు అప్పగించారు.
సాయికిరణ్‌ను విచారించిన పోలీసులు దిమ్మదిరిగే విషయాలు తెలుసుకున్నారు. తన అక్కను ప్రేమ పెళ్లి చేసుకొని విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిపై కక్ష పెంచుకొని కోర్టుకు కత్తి తీసుకొచ్చాడని గుర్తించారు. దీంతో, హైదరాబాద్‌లో మరోసారి పరువు హత్యకు ప్రయత్నం జరిగిందన్న కలకలం చెలరేగింది.
చదువుకుంటున్న సమయంలో క్లాస్‌మేట్స్ అయిన మియాపూర్‌కు చెందిన యువతి, మరో మతానికి చెందిన యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో యేడాది క్రితం ఇద్దరూ ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఉప్పల్ సమీపంలోని చెంగిచెర్లలోని ఆర్యసమాజ్‌లో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. అయితే, ఏడాది తిరగకముందే ఇద్దరి మధ్యా కలహాలు చెలరేగాయి. దీంతో, పరస్పరం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. విడాకుల కోసం మూడు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బుధవారం విచారణ ఉండటంతో యువతి, తన సోదరుడితో కలిసి కోర్టుకు వచ్చింది. ఆ సమయంలోనే యువతి సోదరుడి దగ్గర కత్తి దొరికింది. సెక్యూరిటీ సోదాల్లో బండారం బయటపడింది.
తన సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడని కక్ష పెంచుకున్న సాయికిరణ్ మారణాయుధంతో కోర్టుకు వచ్చాడు. అయితే, యువతి మాత్రం తమకు ప్రాణభయం ఉందని.. ముందు జాగ్రత్తగా మాత్రమే తన సోదరుడు కత్తి తీసుకొచ్చాడని చెబుతోంది. మొత్తానికి కోర్టు సెక్యూరిటీ అప్రమత్తతతోనే పెను ప్రమాదం తప్పిందని అక్కడున్న న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో రెండు పరువు హత్యలు (Honor Killings in Hyderabad) జరిగిన నేపథ్యంలో.. మరోసారి అలాంటి దారుణం జరిగి ఉండేదేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ఎల్‌బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలేంటో వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also read : Hyderabad Honour Killing: నీరజ్ హత్యకు పక్కా స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు
Also read : Begum Bazar Murder: నీరజ్‌ను చంపింది వాళ్లే... ఆరుగురు నిందితుల అరెస్ట్.. కీలక వివరాలు వెల్లడించిన డీసీపీ...