YSRTP chief YS Sharmila about Huzurabad bypolls: హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్‌కు ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి సీఎం కేసీఆర్‌కు (CM KCR) అమ్ముడుపోయారని ఆరోపించిన ఆమె.. ఉప ఎన్నికకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా రిటర్నింగ్ అధికారి అడ్డుకుంటున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నామినేషన్స్ వేయడానికి వచ్చిన వారిని నిత్యం ఏదో ఓ సాకుతో నామినేషన్స్ వేయకుండానే వెనక్కి పంపిచ్చేస్తున్న ఆ అధికారిని (Huzurabad bypolls returning officer) వెంటనే విధుల నుంచి తొలగించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ వల్ల ఉద్యోగం కోల్పోయిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆయనపై తమ నిరసనను తెలియజేసేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) పోటీ చేయడాన్ని ఓ మార్గం ఎంచుకున్నారని.. అయితే వారు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినప్పుడు, వారికి రోజుకో రకమైన రూల్ పెడుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిప్పి పంపిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిర్వాకం వల్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారన్న ఆమె.. నామినేషన్లకు గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయెల్‌కి (Telangana CEC Shashank Goel) విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారం మీద తాము కోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడబోమని వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. తమ ఆరోపణలకు సాక్ష్యంగా వార్తా పత్రికల్లో వస్తున్న వార్తా కథనాల కాపీలను ఆమె సీఈసీకి అందించారు.
హుజురాబాద్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కేసీఆర్ కి అమ్ముడుపోయారు. ఇండిపెండెంట్ నామినేషన్ వేయకుండా అధికారులు రోజుకో రూల్ పెడుతున్నారు. అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారు.
ఆ అధికారిని బదిలీ చేయాలి లేదా సస్పెండ్ చేయాలి. నామినేషన్ గడువు సమయం కూడా పెంచాలిhttps://t.co/tTFpGKFC6R— YS Sharmila (@realyssharmila) October 7, 2021
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ సర్కారు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణం అని అన్నారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హుజూరాబాద్‌లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్ షర్మిల (YS Sharmila) ఆవేదన వ్యక్తంచేశారు.