Teenmar Mallanna Political Plans: తీన్మార్‌ మల్లన్న ఏం చేయబోతున్నారు ? అనూహ్య నిర్ణయాల వెనుక వ్యూహమేంటి ?

Teenmar Mallanna Political Plans: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న విధానాలపైన, మంత్రులు, ఉన్నతాధికారుల వేధింపులపైనా, బాధితుల తరపున సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో గళమెత్తిన తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు తీవ్ర చర్చనియాంశమవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 10:48 PM IST
  • తన ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి కేసీఆరేనని ప్రకటించుకున్న తీన్మార్ మల్లన్న
  • ఎవ్వరూ ఊహించని వ్యాఖ్యలు చేసిన తీన్మార్‌ మల్లన్న
  • తీన్మార్‌ మల్లన్న ఎవ్వరూ ఊహించని నిర్ణయమేదైనా తీసుకోబోతున్నారా ?
Teenmar Mallanna Political Plans: తీన్మార్‌ మల్లన్న ఏం చేయబోతున్నారు ? అనూహ్య నిర్ణయాల వెనుక వ్యూహమేంటి ?

Teenmar Mallanna Political Plans: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ కుమార్‌. తెలంగాణలో ఓ ట్రెండింగ్‌ పర్సన్‌. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ఎదిగిన నేత. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ఓట్లు తెచ్చుకున్న నాయకుడు. తెలంగాణ ప్రభుత్వం విధానాలను, ప్రధానంగా సీఎం కేసీఆర్‌ పోకడలను నేరుగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో తనదైన ఫాలోయింగ్‌ను సంపాదించారు. ప్రధానంగా యువతలో ఆలోచన రేకెత్తించేలా, ఆకట్టుకునేలా ప్రసంగించడంలో, ప్రభుత్వ విధానాలను విమర్శించడంలో తీన్మార్‌ మల్లన్న తనదైన ముద్ర వేసుకున్నారు. ఫలితంగా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీన్మార్‌ మల్లన్నకు ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారు. 

ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న విధానాలపైనా, మంత్రులు, ఉన్నతాధికారుల వేధింపులపైనా, బాధితుల తరపున సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. ఈ క్రమంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినా మల్లన్న ఏనాడూ వెనక్కి తగ్గలేదు. సోషల్‌మీడియానే తన వేదికగా వాడుకుంటూ విమర్శల ఆయుధాలను ఎక్కుపెట్టారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌నే టార్గెట్‌గా చేసుకొని సూటిగా ప్రశ్నలు వేసేవారు. ఈ క్రమంలో కేసీఆర్‌పైనా, కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌పైనా నేరుగా దూషణలకు పాల్పడేవారు. ఓ దశలో కేటీఆర్‌ కుమారుడు హిమాన్ష్‌ గురించీ తీన్మార్‌ మల్లన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై పోస్ట్‌ చేసిన ఒపీనియన్‌ పోల్‌ తీవ్ర రాద్ధాంతానికి దారి తీసింది. తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూన్యూస్‌ కార్యాలయంపై అర్థరాత్రి దాడికి కూడా కారణమయ్యింది. ఈ స్థాయిలో టఫ్‌ ఫైట్‌ ఇచ్చిన తీన్మార్‌ మల్లన్న కొద్దిరోజులుగా అనుసరిస్తున్న వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న ప్రణాళికలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మీడియాలోనూ విశ్లేషణకు కారణమవుతున్నాయి.

తెలంగాణ యాసలో, పల్లెటూరి భాషలో కేసీఆర్‌పై తీన్మార్‌ మల్లన్న మాటల యుద్ధం..
కేవలం కేసీఆర్‌పైనే తన యుద్ధమంటూ అనేకసార్లు ప్రకటించిన తీన్మార్‌ మల్లన్న తరచూ తెలంగాణ సీఎం టార్గెట్‌గా దూషణల పర్వం సాగించేవారు. వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు, ప్రకటించిన విధానాలను విశ్లేషిస్తూ.. ఆచరణలో అవేమీ కనిపించడం లేదని ఆధారాలతో సహా తన మీడియా వేదికగా విశ్లేషించేవారు. కేసీఆర్‌ విధానాలు, వ్యవహారశైలి నచ్చని వాళ్లందరినీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు, విశ్లేషణలు ఆకట్టుకునేవనడంలో సందేహం లేదు. తెలంగాణ యాసలో, పల్లెటూరి భాషలో కేసీఆర్‌పై తీన్మార్‌ మల్లన్న మాటల యుద్ధం చేసేవారు. అవన్నీ యూత్‌లో మల్లన్న అంటే ఫాలోయింగ్‌ను పెంచాయి. ఈ పరిణామాలతో తీన్మార్‌ మల్లన్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు వచ్చిన స్థాయిలో ఓట్లను సాధించి సవాల్‌ విసిరారు. తదుపరి ఎన్నికల్లో విజయం తథ్యమన్న ఆశలను చిగురింపజేసుకున్నారు. 

తన ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్‌..
తన ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ప్రతి సందర్భంలో ప్రకటించే తీన్మార్‌ మల్లన్న.. గత డిసెంబర్‌లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ వెళ్లి మరీ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంలోనూ తన సహజ శైలిలో కేసీఆర్‌పై ఢిల్లీ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలతో విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారుగా ఎదుగుతున్నామనుకున్న బీజేపీ నేతలకు ఈ పరిణామం మరింత బలాన్ని ఇచ్చిందన్న విశ్లేషణలు సాగాయి. కానీ, ఇటీవలే '7200 మూవ్‌మెంట్‌'  పేరుతో హైదరాబాద్‌ శివారు కొర్రేములలో ఓ సభను నిర్వహించిన తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అనూహ్యరీతిలో ప్రసంగించారు. తాను బీజేపీలో చేరానన్నది గడిచిన చరిత్ర అని, ఇకపై బీజేపీ కార్యాలయం గడప తొక్కబోనని ప్రకటించారు. ఇకపై 7200 మూవ్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రజల్లోకి వెళ్తానని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టడమే తన లక్ష్యమని, ప్రభుత్వంలో, ప్రభుత్వాధికారుల్లో లంచాలను రూపు మాపి.. సామాన్యులకు సహకరించే పాలన రావడమే ఆశయమని చెప్పారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్‌ మల్లన్న ఏం చేయబోతున్నారన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. ఆ తర్వాత తీన్మార్‌ మల్లన్న ప్రసంగాల్లో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్న విశ్లేషణలు కొనసాగాయి. అంటే, తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతున్నారేమోనని, అందులో భాగంగానే బీజేపీకి సంబంధించి ప్రకటన చేశారన్న చర్చ కొనసాగింది.

తీన్మార్‌ మల్లన్న నుంచి ఎవ్వరూ ఊహించని వ్యాఖ్యలు..
ఇక, తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌లో '7200 మూవ్‌మెంట్‌' సన్నాహక సమావేశంలో పాల్గొన్న తీన్మార్‌ మల్లన్న ఎవరూ ఊహించని రీతిలో ప్రసంగించారు. సంచలన శపథం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇలాకాలోనే.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 7200 మూవ్‌మెంట్‌ వాహకంగా దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పోరాటం సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులను తిట్టడం తన విధానం కాదన్న తీన్మార్‌ మల్లన్న.. పెద్దోళ్లు, పేదోళ్ల పిల్లలందరూ కలిసి ఒకే వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. అంతేకాదు.. బాల్క సుమన్‌, గ్యాదరి కిషోర్‌ వంటి విద్యావంతులకు విద్యా శాఖ మంత్రి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని సూచన కూడా చేశారు. 

తీన్మార్‌ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని, ఒట్టేసి మరీ కేసీఆర్‌ను ఇకపై తిట్టబోనని చెబుతారని ఎవరూ ఊహించలేదు. అంతేకాదు.. కొందరు నేతలపేర్లను ప్రస్తావించి మరీ వాళ్లకు ఫలానా శాఖ అప్పగించాలని సూచించడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే.. తీన్మార్‌ మల్లన్న కాంగ్రస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం లేదని, టీఆర్‌ఎస్‌కు దగ్గర కావొచ్చన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
దీనికి తోడు.. ఇటీవల తీన్మార్‌ మల్లన్న ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని పరోక్షంగా చెప్పారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే ప్రస్తావన వచ్చిన సమయంలో తాను తలచుకుంటే, పదవిపై మోజు ఉంటే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే పార్టీలో చేరవచ్చునని, కానీ, తనకు తన లక్ష్యమే ముఖ్యమంటూ.. పై వ్యాఖ్యలు చేశారు.

తనకున్న ఆస్తులన్నీ ప్రభుత్వానికే రాసిస్తా..
తనకున్న ఆస్తులన్నీ ప్రభుత్వానికే రాసిస్తానని, ఆ తర్వాత జూన్‌ రెండో తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని మల్లన్న మరో సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వచ్చే వాళ్లందరూ కూడా ఇలాగే, తమ ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చి అరంగేట్రం చేస్తే ప్రజలకు నాయకులపై నమ్మకం కలుగుతుందని, నిస్వార్థంగా సేవ చేయవచ్చని తీన్మార్‌ మల్లన్న అభిప్రాయపడ్డారు. మరి.. గడిచిన కొద్దిరోజుల్లోనే వ్యూహాలు మారుస్తూ... ప్రసంగాల శైలిని మారుస్తూ వస్తున్న తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna Latest News) ఏం చేయబోతున్నారన్నది సోషల్‌ మీడియాలోనూ చర్చ సాగుతోంది. ఎవరూ ఊహించని నిర్ణయమేదైనా తీసుకోబోతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు కేసీఆర్‌పై తిట్లతో, కేసీఆర్‌పై విమర్శలతో తన పంథాను కొనసాగించిన తీన్మార్‌ మల్లన్న.. అధికార టీఆర్‌ఎస్‌ వైపు దృష్టిసారించారా? అన్నది క్వశ్చన్‌మార్క్‌గా మారింది.

Also read : Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

 

Also read : Teenmar Mallanna: బీజేపీ ఆఫీస్‌లో అడుగుపెట్టేది లేదు..కమలానికి తీన్మార్ మల్లన్న బైబై ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x