సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నవంబర్ నుంచి నేరుగా సంగారెడ్డిలోని తన ఇంటికే వచ్చి సమస్యలు విన్నవించుకునేలా ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తెలిపారు. బుధవారం దసరా వేడుకలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా తనకు, మంత్రి హరీష్ రావుకు మధ్య మాటలు లేవని, అయినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ఆయనతో మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో ఐఐటీ తీసుకొచ్చానని చెప్పిన జగ్గా రెడ్డి.. తాను పార్టీలకు తల వంచనని, ప్రజలకే తల వంచుతానని పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు సేవ చేయాలని సూచిస్తూ.. బతికుండగా తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారు మరణించిన తర్వాత వారి ఫోటోలకు మొక్కితే ఏం లాభమని అన్నారు. అందుకే వారు బతికుండగానే సేవ చేయాలని యువతకు హితవు పలికారు. తన తల్లి ఎంతో కష్టపడి తనను పైకి తీసుకొచ్చిందని చెబుతూ.. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం బాగో లేని కారణంగా తన సతీమణి నిర్మల ఆమె బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. తనకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవనీ చెప్పిన జగ్గా రెడ్డి.. అదనంగా కోట్లాది రూపాయల అప్పు మిగిలిందని చెప్పడం గమనార్హం.