Kadiyam Kavya: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి పోటీకి నిరాకరించారు. ఇలాంటి పరిస్థితి ఎదురవడం తెలంగాణ రాజకీయాల్లో బహుశా మొదటిసారి కావొచ్చు. పోటీకి నిరాకరించిన వ్యక్తెవరో కాదు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య. వరంగల్ లోక్‌సభకు అభ్యర్థిగా ప్రకటించగా తాను పోటీ చేయలేనని ప్రకటించి సంచలనం రేపింది.
ఈ సందర్భంగా కడియం కావ్య కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. పోటీకి దూరంగా ఉండడానికి కారణాలను వివరించింది. ప్రస్తుతం పార్టీకి ఎదురవుతున్న పరిణామాలు, అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న తప్పుడు ప్రచారం, అక్రమ కేసులను ప్రస్తావిస్తూ ఆమె లోక్‌సభ బరి నుంచి తప్పుకుంది. ఆమె నిర్ణయంపై వరంగల్ జిల్లానే కాకుండా బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొదట పోటీకి ఆసక్తి కనబర్చి టికెట్ ప్రకటించిన వారానికి వైదొలగడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read: Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్
కడియం కావ్య ప్రకటన ఇలా..
'మే 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జా, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, మద్యం కుంభకోణం వంటి అంశాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకుంటున్నా. కేసీఆర్, పార్టీ నాయకత్వం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నా'
గులాబీ పార్టీకి షాక్
ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కంచుకోట. వరుసగా వరంగల్ కోటపై గులాబీ జెండా ఎగురుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికలు రాగా ఆ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా వరంగల్ నుంచి కావ్య పోటీ నుంచి విరమించుకోవడం గులాబీ పార్టీకి చేటు చేసేలా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook