సింగరేణి కార్మికులతో ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై అనేక అంశాల మీద చర్చించారు. వారి ఇంటి నిర్మణాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుత టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ముఖ్యమంత్రి, గతంలో తమ సొసైటీ అధికారంలోకి వచ్చినా పనులు ఆశించినంత రీతిలో జరగలేదని, కానీ ప్రస్తుతం సింగరేణి కార్మికుల సమస్యలను తొలిగించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని.. మరో 20 రోజుల్లో సీఎం సింగరేణి యాత్రను ప్రారంభించి, తానే స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకుంటానని, సింగరేణి దవాఖానా లోనే బీపీ చెక్ చేయించుకుంటానని తెలిపారు. తాను వచ్చేసరికల్లా కార్మికులు సమస్యల జాబితాను తయారుచేసి ఇవ్వాలని కోరారు. లంచం తీసుకొనే వారిని కార్మికులు చెప్పుతో కొట్టాలని, గతంలో చాలా కార్మిక సంఘాల నేతలు, కార్మికుల డబ్బులతోనే బాగుపడ్డారని చెప్పారు. ఇకపై కార్మిక సంఘాలకు ఇచ్చే సభ్యత్వ రుసుము ఒక రూపాయి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందని, ఆ వాటాలోని అధిక భాగాన్ని కార్మికుల సంక్షేమానికే తాము ఖర్చుపెడతామని కేసీఆర్ తెలిపారు. అలాగే సింగరేణిలోని ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రయత్నిస్తామని కూడా చెప్పారు. అలాగే అంబేద్కర్ జయంతి రోజున సింగరేణిలో అధికారిక సెలవు దినం పాటించాలని, అలాగే కార్మికుల పిల్లలు ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీటులు సంపాదిస్తే, వారి చదువకయ్యే ఖర్చు అంతా కూడా సింగరేణి కంపెనీయే చూసుకుంటుందని కూడా కేసీఆర్ తెలిపారు.