KT Rama Rao Harish Rao: తెలంగాణలో విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యంగా అరెస్టులు కొనసాగుతుండడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. బంజరాహిల్స్ సీఐతో జరిగిన వాగ్వాదం అంశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కావడంతో తెలంగాణలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అరెస్ట్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ వ్యవహారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే కేసులా' అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
తమ పార్టీ నాయకుల అరెస్ట్‌లపై కేటీఆర్, హరీశ్ రావు 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు! పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు! పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు! గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు! ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు! ప్రభుత్వం కూల్చుతున్న ఇళ్లకు అడ్డొస్తే కేసులు! ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు!' అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్ సీఐతో రచ్చరచ్చ
'ప్రజలపై కేసులు. ప్రజాప్రతినిధులపై కేసులు. కాసులు మీకు.. కేసులు మాకు. సూటుకేసులు మీకు.. అరెస్టులు మాకు' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 'హరీశ్ రావు, జగదీశ్ రెడ్డితోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం. తక్షణం విడుదల చేయాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తమ అరెస్ట్‌లపై హరీశ్ రావు కూడా 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా? ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు' అని వివరించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 'ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే.. నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలిస్తున్నారు' అని వివరించారు. 'అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు' అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదు' అని హెచ్చరించారు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.