హైదరాబాద్: ఎన్నికల కమిషన్ మే 6న విడుదల చేసిన షెడ్యూల్ మేరకు నేడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మళ్లీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. నల్గొండ జిల్లాలోని ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1086 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా 902 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఈ పోలింగ్‌ను చేపడుతున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం జూన్ 5వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. జూన్ 3న ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది.