Mallu Bhatti Vikramarka: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అందుకే.. కేసీఆర్, మోదీలపై భట్టి ఫైర్

Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.

Written by - Pavan | Last Updated : Nov 8, 2022, 03:51 AM IST
Mallu Bhatti Vikramarka: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అందుకే.. కేసీఆర్, మోదీలపై భట్టి ఫైర్

Bharat Jodo Yatra: స్వాతంత్రం తీసుకొచ్చి దేశ జాతిపితగా మహాత్మా గాంధీ దేశ చరిత్రలో ఎలాగైతే నిలిచిపోయారో.. జాతి సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీ కూడా చరిత్రలో అలాగే నిలిచిపోతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న దేశ స్వాతంత్రాన్ని, డా బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బిజెపి అపహస్యం చేస్తోంది. రాజకీయంగా సొంత లబ్ధి కోసం మత విద్వేశాన్ని చిమ్ముతూ దేశంలో అరాచకం సృష్టిస్తోంది. దేశాన్ని మతాల పేరిట విభజన చేసి రక్తపాతం సృష్టిస్తోన్న బిజేపి ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా మేనూరులో జరిగిన భారత్ జోడో యాత్రలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన గత 8 సంవత్సరాల్లో దేశ సంపదను ప్రధాని మోదీ తన స్నేహితులైన కార్పొరేట్ కంపెనీల యజమానులకు పంచి పెడుతున్నారు. ప్రధాని మోదీ ఈ దేశ సంపదను దోచిపెట్టడం వల్లే ప్రపంచ కుబేరుల్లో గౌతం అదాని రెండో స్థానానికి ఎదిగారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకో లేదా కొందరికో మాత్రమే కాకుండా అందరికీ పంచిపెట్టాలన్నదే భారత్ జోడో లక్ష్యం అని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 

నీళ్లు, నిధులు, నియామకాలు వంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ.. పార్లమెంట్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి సంపూర్ణ రాజకీయ మెజార్టీ లేనప్పటికీ.. అందరినీ ఒప్పించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.  

నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉద్యమం సమయంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. చివరికి ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిండని కేసీఆర్ పై మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కృష్ణా నది, గోదావరి నదిపై ప్రాజెక్టులను నిర్మించకుండా జలాలను సముద్రంపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

Trending News