తన పంట చేనులో కూలికి వచ్చే ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ మోసగాడికి కేవలం జరిమానా విధించి వదిలేసిన గ్రామ పెద్దలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నారాయణ్‌పేట్‌కి చెందిన వెంకటయ్య తన పత్తి చేనులో కూలికి వచ్చిన ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. కూతురిలో శారీరక మార్పులు గమనించిన బాధితురాలి తల్లి వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె గర్భవతి అని తేలింది. ఇదే విషయమై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలి తల్లిదండ్రులను, నిందితుడిని పిలిపించి రాజీ కుదిర్చిన గ్రామ పెద్దలు.. నిందితుడికి రూ.2.5 లక్షల జరిమానా విధించి అతడిని వదిలేశారు. డబ్బులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉండాల్సిందిగా బాధితురాలి తల్లిదండ్రులకు నచ్చచెప్పారు.
ఆగస్టు 1న జరిగిన ఈ ఖాప్ పంచాయతీపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఎం. కృష్ణయ్య గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. మైనర్ బాలికను నమ్మించి మోసం చేసిన నిందితుడు వెంకటయ్యతోపాటు ఖాప్ పంచాయతీ చెప్పి, నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు గ్రామ పెద్దలను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 376(అత్యాచారం), లైంగిక వేధింపుల బారి నుంచి మైనర్లను రక్షణ కల్పించే పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.కృష్ణయ్య పీటీఐకి తెలిపారు.