Minister Harish Rao: ప్రజలు కట్టే పన్నుల్లోంచే మనం జీతాలు తీసుకుంటున్నాం కనుక మనం అందరం ప్రజా సేవకులమే అని మంత్రి హరీష్ రావు అన్నారు. " గర్భిణిలు, శిశు మరణాలు అనేది అసలు జరగకుండా చూసుకోవాలని.. ఒకవేళ దురదృష్ణవశాత్తుగా ఏవైనా మరణాలు జరిగినట్టయితే.. ఆ మరణాలకు కారణం ఏంటని తెలుసుకునే దిశగా లోతైన డెత్ ఆడిట్ జరగాలి" అని అధికారులకు స్పష్టంచేశారు. " ఏవైనా మరణాలు సంభవించినప్పుడు బర్త్ ప్లానింగ్ నుంచి చివరి దశ వరకు పొరపాటు ఎక్కడ జరిగింది అని తెలుసుకుంటేనే ఆ తరువాతి నుంచి స్త్రీ, శిశు మరణాలు తగ్గించవచ్చు" అని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పారామెడికల్ సిబ్బందికి మంత్రి హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ పాత బస్తీలోని పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో జరిగిన ఓ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు... వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిలో స్పూర్తిని నింపేలా మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
" ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణిలకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది మానవత్వంతో చికిత్స అందించాలని.. వాళ్లను పేషెంట్స్‌లా కాకుండా వారిలో మీ సోదరినో, తల్లినో లేక బిడ్డనో చూసుకున్నట్టయితే.. వారి పట్ల మీరు స్పందించే తీరులో మార్పు వస్తుందని అన్నారు. ఆస్పత్రికి వచ్చిన పేషెంట్స్‌ని తల్లిలా ట్రీట్ చేస్తే.. ఎలాంటి ఇబ్బుందులు తలెత్తవు అని అన్నారు. ఏదేమైనా ప్రజల ప్రాణాలు కాపాడటమే మన ప్రధాన కర్తవ్యం అనే విషయాన్ని సిబ్బంది మర్చిపోకూడదు" అని అన్నారు.
బర్త్ వెయిటింగ్ రూమ్స్
చాలా సందర్భాల్లో గర్భిణులకు నొప్పులు వచ్చాకా సకాలంలో ఆస్పత్రికి చేరలేని సందర్భంలోనే తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రమాదంలో పడుతున్నారని.. అలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితమే బర్త్ వెయిటింగ్ రూమ్స్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ పెక్టెడ్ డెలివరి డేట్ కంటే వారం, పది రోజులు ముందుగానే గర్భిణిలు వచ్చి డాక్టర్ల సలహా తీసుకుని, అవసరం అయితే కాన్పు అయ్యే వరకు ఈ బర్త్ వెయిటింగ్ రూమ్స్ లో ఉండవచ్చని సూచించారు. గర్భిణిలతో పాటు వారితో ఉండే అటెండెంట్స్ కి కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తూ వారికి బోజనం సదుపాయం కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది సమక్షంలో గర్భిణికి, ఆమె కడుపులో ఉండే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదనే ఉద్దేశంతోనే ఈ బర్త్ వెయిటింగ్ రూమ్స్ సౌకర్యం తీసుకొచ్చినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.
30 రోజుల నుంచి 60 రోజుల ముందే ప్రసవాలు ఎందుకు చేస్తున్నారని మండిపడిన మంత్రి
ఒకట్రెండు ఆస్పత్రుల్లో గర్భిణిలకు ఎక్స్‌పెక్టెడ్ డెలివరి డేట్ కంటే 30 రోజుల నుంచి 60 రోజుల ముందే ప్రసవాలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు మంత్రి హరీష్ రావు. ఒకట్రెండు ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ వైనం గురించి తన దృష్టికి వచ్చిందని.. ఆ ఆస్పత్రుల పేర్లు వెల్లడించి వాటి పేరు డ్యామేజ్ చేయడం తనకు ఇష్టం లేదని.. కాకపోతే ఆ ఆస్పత్రిలో రికార్డులు పరిశీలిస్తే.. 20 శాతం కేసులు నెల రోజుల నుంచి 2 నెలల ముందే సిజేరియన్ చేసి ప్రసవాలు చేస్తున్నారు అని తేలిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
ఎక్స్‌పెక్టెడ్ డెలివరి డేట్ కంటే వారం లేదా పది రోజుల ముందు డెలివరి చేయాల్సి రావడం సహజమే కానీ మరీ నెల, రెండు నెలలు ముందు చేయడాన్ని ఆ ఆస్పత్రి సిబ్బంది ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. గర్భంలో ఉన్న శిశువు పూర్తిగా ఎదగకముందే... వారికి నొప్పులు రాకముందే గర్భిణికి సర్జరీ చేసి ప్రసవం చేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎలా ఉంటారని సిబ్బందిని నిలదీశారు. అలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో ఎదగకుండా పుట్టిన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వారి జీవితాలతో ఆడుకునే హక్కు మనకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు... ఆ ఒకట్రెండు ఆస్పత్రుల వివరాలు తన వద్ద ఉన్నాయని.. వారిపై తాను చర్యలు తీసుకోబోతున్నాను అని హెచ్చరించారు. నర్సులు పేషెంట్స్ పట్ల పాజిటివ్ వైఖరితో వ్యవహరించాలని సూచించారు. అలా కాకుండా లేబర్ రూమ్‌లో కానీ ఆస్పత్రిలో కానీ నర్సులు వరైనా పేషెంట్స్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టయితే.. ఆ ఒక్కరు చేయబట్టి మొత్తం ఆస్పత్రికే చెడ్డ పేరు వస్తుందని సిబ్బందిని మందలించారు.