Minister Ktr Letter To Telangana Youth: తెలంగాణ యువతకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు.. సంఘర్షణకు ప్రతిరూపం అంటూ ఆయన ఉత్తేజాన్ని నింపే వ్యాఖ్యలతో లేఖ మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుందని అన్నారు. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని చెప్పారు. గత 9 ఏళ్ల వ్యవధిలో దాదాపు రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను సరికొత్తగా లిఖించబోతుందన్నారు.
ఉద్యమకాలంలో, అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే పూర్తి చేశామని.. రెండోసారి 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టామన్నారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామని.. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నామని తెలిపారు. మొత్తంగా రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువత కోసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించామని ఆయన తెలిపారు. త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నామన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగుపరిచిందని అన్నారు. ఇప్పటివరకు సుమారు 17 లక్షల మందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత మన రాష్ట్రానిదేనని చెప్పారు. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టీఎస్ఐసీ వంటి వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ యువత కోసం కోచింగ్ సెంటర్లతోపాటు ఇతర వసతులను ఏర్పాటు చేసిందని.. నిరుద్యోగ యువత ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తోందన్నారు.
'ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒక్కటే. పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకండి. అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టండి. సానుకూల దృక్పథంతో సాధన చేసి.. స్వప్నాలను సాకారం చేసుకోండి. కాలం తిరిగి రాదు. అవకాశాలను అందిపుచ్చుకోండి..! ఏకాగ్రతతో అభ్యసించండి. లక్ష్యాన్ని చేరుకోండి..! ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించండి! ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్మకున్న ఆత్మీయుల స్వప్నాలను నిజం చేయండి. తెలంగాణ యువతకు ఆకాశమే హద్దని చాటండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను..' అంటూ మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి నగదు జమ
Also Read: Virat Kohli: లిటన్ దాస్ స్టన్నింగ్ క్యాచ్.. ఆశ్చర్యపోయిన విరాట్ కోహ్లీ.. వీడియో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి