సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏర్పడిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) శనివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని ఆవాసా హోటల్లో 5 గంటలపాటు సమావేశమైన జేఎఫ్సీ ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని, 10వ షెడ్యూల్లోని ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలని ఈ సందర్భంగా జేఎఫ్సీ డిమాండ్ చేసింది. అలాగే జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును కేంద్రమే త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరేందుకు జేఎఫ్సీ తీర్మానం చేసుకుంది.
అదేవిధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ప్రకటించిన సంస్థల నిర్మాణం ఐదేళ్లలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్టు జేఎఫ్సీ తెలిపింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి, తోట చంద్రశేఖర్, పద్మనాభయ్య, ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.