షాద్ నగర్ యువతి 'నిర్భయ' దారుణ హత్య కేసు: నిందితులకు వ్యతిరేకంగా విద్యార్థి, ప్రజా సంఘాల నిరసన

షాద్ నగర్ యువతిపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో నలుగురు నిందితులకు వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమన్నాయి. నిందితులు కస్టడీలో ఉన్న షాద్ నగర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు స్టేషన్ ఎదుట ఆందోళన చేప్టటాయి. దీంతో షాద్ నగర్ పోలీసు స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Last Updated : Nov 30, 2019, 02:54 PM IST
షాద్ నగర్ యువతి 'నిర్భయ' దారుణ హత్య కేసు: నిందితులకు వ్యతిరేకంగా విద్యార్థి, ప్రజా సంఘాల నిరసన

హైదరాబాద్: షాద్‌నగర్ యువతిపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్(26), చింతకుంట చెన్నకేశవులు(20), జొల్లు నవీన్, జొల్లు శివలను నేడు కోర్టుకు తరలించనున్న నేపథ్యంలో నిందితులకు షాద్ నగర్ పోలీసు స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితులపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కన్నెర్రచేసిన నేపథ్యంలో నిందితులను ఆసుపత్రికి తరలించే క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పసిగట్టిన పోలీసులు.. వైద్యులనే ఆసుపత్రికి తీసుకొచ్చి వారికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్టేషన్ వద్దకు చేరుకున్న పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు స్టేషన్ ఎదుట ఆందోళన చేప్టటాయి. దీంతో షాద్ నగర్ పోలీసు స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశు వైద్యాధికారిగా పనిచేస్తోన్న ఓ యువతి.. పశువాంఛ కలిగిన మానవమృగాల చేతిలో దారుణ హత్యకు గురైన తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  

మహబూబ్ నగర్ జిల్లాలో విధులు ముగించుకుని శంషాబాద్‌లోని తన ఇంటికి తిరుగు ప్రయాణమైన వెటరినరి డాక్టర్‌ను షాద్‌నగర్‌లో నిందితులు కుట్రపూరితంగా మోసం చేసి, దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడతంపాటు హత్య చేసిన వైనం అందరినీ షాక్‌కి గురిచేసింది. షాద్ నగర్ ఘటన ఇంట్లోంచి బయటకు వెళ్లిన మహిళలకు, ఆడపిల్లకు రక్షణ ఎక్కడుందంటూ పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. యువతిపై దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. అలాగే నిందితుల తరపున న్యాయవాదులు వకాల్తా పుచ్చుకోరాదని, వారి తరపున న్యాయవాదులు వాదించడానికి ముందుకు రాకూడదని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. 

ఇదిలావుంటే, ఈ అంశంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ.. పోలీసుల అలసత్వం, మా పరిధిలోకి రాదు అంటూ పలు అంశాలపై నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Trending News