రాణి రుద్రమదేవి.. కాకతీయుల వంశంలో ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయుల వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన గొప్ప రాణిమణుల్లో ఆమె కూడా ఒకరు. రుద్రమదేవి పరిపాలన, విజయాల గురించి చరిత్రలో లభ్యమవుతున్నా.. ఆమె ఎలా చనిపోయిందో చాలా మందికి తెలీదు. ఆమె మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. వయోభారంతో చనిపోయారని కొంతమంది.. కాదు యుద్ధంలో వీరమరణం పొందారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఆమె మరణం పై ఇప్పటివరకూ సరైన ఆధారాలు లేవు.
ఇదిలా ఉండగా.. కాకతీయుల కాలానికి సంబంధించిన కొన్ని శిలాశాసనాలను పురావస్తుశాఖ వెలికితీసింది. మునుగోడులో వెలికితీసిన ఈ శిలశాసనాన్ని రుద్రమదేవి మరణశాసనంగా భావిస్తున్నారు. దాని ప్రకారం రుద్రమదేవి 1289, నవంబర్ 27న వీరమరణం పొందారనన్నారు.
అయితే తాజాగా.. రుద్రమదేవి వీరమరణానికి సంబంధించి కొన్ని ఆధారాలు వరంగల్‌లో దొరికాయి. అక్కడ దొరికిన విగ్రహాల ఆధారంగా.. రుద్రమదేవికి, అమ్బదేవునికి మధ్య జరిగిన యుద్ధం తరువాత జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. యుద్ధంలో ఆమె మరణించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బొల్లికుంట గ్రామంలో దొరికిన ఆ రెండు విగ్రహాలను ఆ గ్రామ ప్రజలు చాలా సంవత్సరాల కాలం నుండి పూజిస్తున్నారు. మొదటి శిల్పంలో రుద్రమదేవి పరాక్రమశాలిగా చేతిలో ఖడ్గం, శిరస్సుపై రక్షణ ఛత్రం ధరించి యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఉంది. రెండో విగ్రహంలో రుద్రమదేవి శిరస్సు మీద ఛత్రం లేకుండా ఉంది. దీన్ని బట్టి చూస్తే.. రుద్రమదేవి శత్రురాజుతో పోరాడి మరణించి ఉండవచ్చని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.