తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదే కారణమా ?

తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం ఇదేనా ?

Updated: Apr 14, 2019, 02:32 PM IST
తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదే కారణమా ?
Representational image

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం తక్కువగా ఉండటంపై అటు అధికారవర్గాలు ఇటు రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారే తమకు తోచిన కారణాలను విశ్లేషించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా లోక్ సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ 12 శాతానికిపైగా తగ్గడానికి వెనుకున్న కారణాలను బేరీజు వేసుకుంటున్న సమయంలో పరిశీలకుల ముందు రెండు కారణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో కనబర్చిన ఆసక్తిని పార్లమెంటరీ నేతలను ఆ పై నేతలను ఎన్నుకోవడంలో కనబర్చకపోయి వుండవచ్చనేది ఒక కారణమైతే... మండుటెండల తీవ్రత లోక్ సభ ఎన్నికలపైనా ప్రభావం చూపించి ఉంటుందనేది మరో అభిప్రాయంగా వినిపిస్తోంది.

లోక్ సభ ఎన్నికలు జరిగిన నాటి ఉష్ణోగ్రతల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే, రామగుండంలో అత్యధికంగా 48.2 ఉష్ణోగ్రత నమోదవగా నల్గొండలో 43 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌లో 42.8,  భద్రాచలంలో 42, మెదక్‌లో 41.8, మహబూబ్‌నగర్‌లో41.6, హన్మకొండలో 41.5, ఖమ్మంలో 40.6, హైదరాబాద్ 40.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బహుషా వివిధ సమస్యలతో ఎండ తీవ్రతకు బయటికి వెళ్లేంత సాహసం చేయలేని ఓటర్లు ఇంటికే పరిమితమై ఉండుంటారని, అందువల్ల కూడా పోలింగ్ శాతం తగ్గి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.