Revanth Reddy About KCR: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా.. కొత్త సెక్రటేరియట్‌పై రేవంత్ రెడ్డి కామెంట్స్

Revanth Reddy Comments on KCR: మహబూబ్‌నగర్ లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు ఎంతో చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. చేసిందేమీ లేదంటూ వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విడివిడిగా ప్రస్తావిస్తూ ఆ హామీలను నిలబెట్టుకోలేదని చెప్పుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 05:55 AM IST
Revanth Reddy About KCR: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా.. కొత్త సెక్రటేరియట్‌పై రేవంత్ రెడ్డి కామెంట్స్

Revanth Reddy Comments on KCR: మహబూబ్‌నగర్ లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మీ పాలమూరు బిడ్డను ఆశీర్వదించండి అంటూ అనేకానేక అంశాలను ప్రస్తావించుకొచ్చారు. “ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం భూములు, కాంట్రాక్టర్ల పేరిట కోట్లాది రూపాయాలను కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారు. కేసీఆర్ దేశానికి చూపించాలనుకుంటున్న తెలంగాణ మోడల్ ఇదేనా?” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివారం మహబూబ్‌నగర్లో మెట్టుగడ్డ నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
 
పాలమూరు బిడ్డలు కష్టజీవులు. కష్టాన్ని నమ్ముకుని జీవించే వారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణంలో పాలమూరు బిడ్డల కష్టం ఉందని ఆయన అన్నారు.  కృష్ణా, తుంగభద్ర నీళ్లతో తడిసిన నేల పాలమూరు జిల్లా అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు, సురవరం ప్రతాపరెడ్డి, కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, మహేంద్రనాథ్ మన పాలమూరు బిడ్డలే అని ఆయన వ్యాఖ్యానించారు.
 
జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినవే. 2009లో కరీంనగర్ ప్రజలు బోంద పెడ్తరని భయడి పాలమూరుకు వస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. మరి తొమ్మిదేళ్లయినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు?  అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్ధిపేటలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ కట్టి పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేయలేదు. పాలమూరు జిల్లా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో ఒక్కసారి ఆలోచించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. 2010లో అలంపూర్ ప్రాంతంలో వరదలు వస్తే బంజారాహిల్స్ లోని తన ఇళ్లు అమ్మి అయిన వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు. ఒక్క ఇళ్లు కట్టి ఇయ్యలేదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు.

“1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది చనిపోయినా తెలంగాణ రాలేదు. 2000లో చిన్నారెడ్డి నేతృత్వంలో 42 మంది శాసనసభ సభ్యులు సోనియా గాంధీకి తెలంగాణ కావాలని వినతి పత్రం ఇచ్చారు. అప్పుడు వనపర్తిలో సభ నిర్వహిస్తే 10 వేల మంది కూడా రారు అనుకుంటే 50 వేల మందికి పైగా వచ్చారు. ఇది చూసి 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తే ఓట్లు వస్తాయి అని ఆశ మొదలైంది” అని రేవంత్ రెడ్డి అన్నారు. “తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబసభ్యులు కానీ, బంధువులు కానీ, కేసీఆర్ కుటుంబంలో బొచ్చు కుక్క కూడా ప్రాణాలు కోల్పోలేదు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చింది పేదింటి బిడ్డలే” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“నూతనంగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కు నిజంగా అంబేద్కర్ భావజాలం ఉంటే... మీ మంత్రి వర్గంలో నలుగురు మీ సామాజికవర్గం వారు ఉంటే మాల మాదిగలకు ఎంత మంది స్థానం ఇచ్చారు? మాదిగల నుంచి ఒక్కరి కూడా ఎందుకు చోటు ఇవ్వలేదు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మీరు ముఖ్యమంత్రి అయ్యారని అంటున్నారు. వచ్చిన తెలంగాణలో మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్నావ్. మరీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? బాబా సాహెబ్ అంబేద్కర్ వారికి హక్కులు ఇవ్వలేదా?  కేవలం మీ కుటుంబానికే ఇచ్చారా?” అని కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

రాష్ట్రంలో దుర్మార్గపు పరిస్థితులు దాపురించాయి అని రేవంత్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్ లో ప్రత్యక్ష మవుతున్నాయి. ఇంటర్మీడియెట్ పరీక్ష పేపర్లను సరిగ్గా దిద్దలేకుపోతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు జీరాక్స్ సెంటర్ లలో దొరుకుతున్నాయి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం భూములు, కాంట్రాక్టర్ల పేరిట కమీషన్లు కొల్లగొట్టారు. ఇప్పుడు ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను వందలాది కోట్లకు అమ్ముకుంటున్నారు. ఇదేనా తెలంగాణ మోడల్?” అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
2018 ఎన్నికల్లో ఉద్యోగం ఇవ్వకపోతే కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు కేసీఆర్. నిరుద్యోగ భృతి హామీకి దిక్కే లేదు. 2019 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 51 నెలల అవుతుంది. ఆ లెక్కన ప్రతి నిరుద్యోగి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1 లక్షా 60 వేల బాకీ ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడే కేసీఆర్ ను క్షమించే ప్రసక్తే లేదు అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ముసుగులో కేసీఆర్ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు అని రేవంత్ వ్యాఖ్యానించారు. 
 
ఇక్కడో మంత్రి ఉన్నాడు నిరంజన్ రెడ్డి. నకిలీ పంచగాడు. లాల్చీ వేసుకున్నోడు లాల్ బహద్దూర్ శాస్త్రి కాడు. గడ్డం పెంచుకున్నాడో భగత్ సింగ్ కాడు. పంచె కట్టినోడు వైఎస్ కాడు. అందుకు ఎంతో ఉండాలి. పంచె కట్టిన మంత్రి నిరంజన్ వైఎస్ లా ఫీలవుతున్నారు అని రేవంత్.. నిరంజన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. ఇంకో మంత్రి ఉండు. హాఫ్ కు ఎక్కువ ఫుల్ కు తక్కువ. ఒక్కని గెలిపిస్తే గేదేకు తోడు దూడ వచ్చినట్టు.. మంత్రితో తమ్ముడు వచ్చిండు. భూములను కబ్జా చేస్తుండు. ప్రజల్ని బెదిరిస్తూన్నారు. ఈ క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా... పాలమూరును భయపెడుతున్న దున్నపోతును, దూడను కట్టేసి బుద్ది చెబుతాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
 
మీ పాలమూరు బిడ్డకు కాంగ్రెస్ రథసారధిగా సోనియాగాంధీ అవకాశం ఇచ్చారు అని రేవంత్ రెడ్డి అన్నారు. “మీ కష్టమే నన్ను పీసీసీ అధ్యక్షున్ని చేసింది. నేను పీసీసీ అధ్యక్షున్ని అంటే పాలమూరులోని ప్రతి బిడ్డ పీసీసీ అధ్యక్షుడే. మహామహాలు ఉన్నా నల్లమల్ల బిడ్డకు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించే అవకాశం వచ్చింది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వంటి వారికి భీ ఫామ్ ఇచ్చే అవకాశం మీ బిడ్డకు వచ్చింది. మీ బిడ్డను ఆదరించండి. జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలను, 2 పార్లమెంటు స్థానాలను గెలిపించండి. ఇప్పుడు కాకుంటే మరో 50 ఏళ్ల వరకు పాలమూరు బిడ్డకు అవకాశం రాదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

“రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు వెళుతున్నాయి. అక్కడ ఏ దేవుడు ఏలుతున్నాడు. ఇక్కడ ఏ దెయ్యాలు ఏలుతున్నాయ్?  జిల్లాలో 14 కు 14 గెలిపిస్తేనే సోనియమ్మకు కృతజ్ఞత చెల్లించిన వాళ్లం అవుతాం. ఓటుకు రూ.5 వేలు ఇచ్చినా..  రోజుకు రూ.2.50 అవుతుంది..రూ.2.50 మీ ఓటును అమ్ముకుంటారా? ఓటును అమ్ముకుంటే ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్లే. ఈ బిడ్డ మీ బిడ్డ..  సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం. జిల్లాలో 14 కు 14 గెలిపించండి అని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

సచివాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదు : రేవంత్
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘‘నూతన సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం, కానీ.. ఎక్కడ కూడా తెలంగాణ CMO ప్రోటోకాల్, నిబంధనలను పాటించలేదు’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గుదేల్చి.. దోషులను కఠినంగా శిక్షిస్తామని రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Trending News