హైదరాబాద్‌ నిజాం మ్యూజియంలో మాయమైన విలువైన వస్తువులు

హైదరాబాద్‌లోని డబీర్‌పురా ప్రాంతంలోని నిజాం మ్యూజియంలో చోరీ జరిగింది.

Last Updated : Sep 4, 2018, 01:59 PM IST
హైదరాబాద్‌ నిజాం మ్యూజియంలో మాయమైన విలువైన వస్తువులు

హైదరాబాద్‌లోని డబీర్‌పురా ప్రాంతంలోని నిజాం మ్యూజియంలో చోరీ జరిగింది. పురాతన బంగారు టిఫిన్ బాక్స్, స్పూన్, టీకప్పు, సాసర్ మొదలైన వాటిని దుండగులు అపహరించారు. ఈ చోరీ విషయం బహిర్గతం అవ్వగానే మ్యూజియం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీలోని కదలికల ద్వారా నేరస్తులను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చోరీ చేసింది బయటి వ్యక్తులా లేదా మ్యూజియంకు పరిచయం ఉన్న వ్యక్తులా? అన్న విషయం కూడా ఇంకా తేలాల్సి ఉంది.

నిజాం మ్యూజియంలో హైదరాబాద్ ఆఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్‌కు వివిధ దేశాల నుండి వచ్చిన కానుకలన్నీ కూడా భద్రపరిచారు. ఇదే మ్యూజియంలో 1930 సంవత్సరం కాలంనాటి అతి పురాతనమైన రోల్స్ రాయస్ కారు కూడా ఉంది. 18 ఫిబ్రవరి 2000 తేది నుండి ఈ మ్యూజియంను పబ్లిక్ కూడా చూడడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. నిజాం నివసించిన ప్యాలెస్ ప్రాంతమే తర్వాత నిజాం మ్యూజియంగా రూపుదిద్దుకుంది. 

హైదరాబాద్‌లో నిజాంకి చెందిన సంపదను దొంగలు దోచుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2008లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మ్యూజియంలో నిజాం వాడిన కత్తిని ఎవరో దొంగలించారు. అలాగే 2011లో సాలర్ జంగ్ మ్యూజియం నుండి పలు వస్తువులను చోరి చేసి అమ్మేసిన కేసులో హసన్ అలీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మ్యూజియం కట్టడాల్లో జరిగే దొంగతనాలను కట్టడి చేయాలంటే.. వస్తువులను ఫోటోలు తీసి డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉందని గతంలో వినోద్ డేనియల్ వంటి ప్రముఖ మ్యూజియం క్యూరేటర్లు తెలిపారు. అలా చేయడం వల్ల వస్తువును ఏ ఇతర దేశంలో అమ్మినా.. దొంగలను వేగంగా పట్టుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Trending News