తెలంగాణలో 'కరోనా వైరస్' కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మరోవైపు జీహెచ్ఎంసీ కార్మికులకు, వైద్యసిబ్బందికి .. కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు నిత్యం పని చేస్తున్న వారికి పారితోషికాలు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఐతే ఇప్పుడు తమకు ప్రకటించిన పారితోషికం సరిపోదని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. చాలీచాలని జీతాలతో ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ కట్టడిలో విధులు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. అలాంటి తమకు కేవలం జీతంలో 10 శాతం మాత్రమే పారితోషికం ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు విధులు బహిష్కరించి గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.
దాదాపు 150 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రకటించిన ప్రోత్సాహకాలు తమకు కూడా అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ్యం అటకెక్కే అవకాశం కనిపిస్తోంది.
ఔట్ సోర్సింగ్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి ఒక నెల జీతం ప్రోత్సాహకంగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
గాంధీ ఆస్పత్రిలో గందరగోళం