Shaikpeta Tehsildar Sujatha | హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ భూ వివాదం కేసులో లంచం తీసుకున్నట్టుగా షేక్‌పేట తహశీల్దార్ సుజాత ఏసీబీ అధికారుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ( AJay Kumar Suicide) చేసుకున్నారు. చిక్కడపల్లిలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లిన అజయ్ కుమార్.. ఉదయం 7 గంటల సమయంలో భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అజయ్ కుమార్ ఓ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అజయ్ కుమార్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
బంజారాహిల్స్‌లోని ఓ స్థలం వివాదం ( Land disputes) విషయమై మిర్ ఆలం మండికి చెందిన స్థల యజమాని సయ్యద్ అబ్దుల్ ఖలీద్ నుంచి షేక్ పేట రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డి ( Shaikpet RI Nagarjuna Reddy) 15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్ఐ నాగార్జున రెడ్డిని కలవాల్సిందిగా తనకు ఎంఆర్ఓ సుజాతనే సూచించారని బాధితుడు సయ్యద్ అబ్దుల్ ఖలీద్ ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సుజాత లంచం తీసుకుంటున్నట్టుగా కానీ లేదా డిమాండ్ చేసినట్టుగా కానీ ఏ ఆధారాలు లేనప్పటికీ.. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఏసీబీ అధికారులు గాంధీ నగర్‌లోని ఆమె ఇంట్లో సోదాలు ( ACB raidings) జరిపారు. ఏసీబీ సోదాల్లో రూ. 24 లక్షల నగదు, నగలు కలిపి రూ.30 లక్షల ఆస్తి బయటపడింది. అయితే ఏసీబీ సోదాల్లో లభించిన రూ. 24 లక్షలకు సుజాత కానీ లేదా ఆమె భర్త అజయ్ కుమార్ కానీ సరైన లెక్క చెప్పలేకపోవడం ఏసీబీ అధికారులకు అనుమానాలకు తావిచ్చింది. ఆ డబ్బును తమ జీతాల్లోంచి పొదుపు చేసుకున్న మొత్తంగా సుజాత చెప్పగా.. అది ఓ స్థలం అమ్మగా వచ్చిన సొమ్ము అని అజయ్ కుమార్ చెప్పాడు. ఇలా ఇద్దరూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు.. స్థలం విక్రయించినట్టుగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అది లంచం సొమ్ముగానే భావించాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఏసీబీ అధికారులు ఈ కేసు విషయమై పలుసార్లు అజయ్ కుమార్‌ని సైతం ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడని అజయ్ కుమార్ సోదరి ఆరోపించారు.