నుమాయిష్.. హైదరాబాద్‌లో ప్రతీ సంవత్సరం జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఈ ఏడాది ఈ ప్రదర్శన జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. గత సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ ప్రదర్శనకు వచ్చారని అంచనా. ఈ సంవత్సరం ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు నుమాయిష్ పూర్వాపరాలు.. దాని విశేషాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందాం
*1938, ఏప్రిల్ 6 తేదిన అప్పటి ముల్కి ఉస్మాన్ అలీఖాన్ జన్మదినం సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో తొలిసారిగా నుమాయిష్‌ను ప్రారంభించారు.
*అప్పట్లోనే దాదాపు 3 లక్షల రూపాయలతో 100 పైగా స్టాల్స్‌తో నుమాయిష్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ స్టాల్స్ సంఖ్య దాదాపు 3 వేలకు పైగా పెరిగింది.
*ఈ నుమాయిష్‌లో భాగంగా 150 నుండి 200 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.
*నుమాయిష్‌లో స్వదేశీ, విదేశీ వ్యాపారస్తులెందరో తమ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతారు.
*కాశ్మీర్ వస్త్రాల దగ్గర నుండి డ్రైఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇరాన్ తివాచీలు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి
*2012 వరకు పాకిస్తాన్ నుంచి కూడా వర్తకులు వచ్చి తమ సామాన్లను అమ్మేవారు. అయితే ఆ తర్వాత వారికి అనుమతిని నిరాకరించారు
*గత కొన్ని సంవత్సరాలుగా గేమింగ్ జోన్లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీ ఉత్పత్తులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లు కూడా నుమాయిష్‌లో కొలువుదీరడం ప్రారంభించాయి
*2018లో తొలిసారిగా ఎగ్జిబిషన్‌లో స్టాళ్లు ఏర్పాటు చేసుకొనే విక్రయదారులకు బీమా సౌకర్యాన్ని కల్పించింది ఎగ్జిబిషన్ సొసైటీ.