తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల అనర్హత కేసు కీలక మలుపు తిరిగింది. తెలంగాణ సర్కార్ తమపై వేసిన అనర్హత వేటు కేసులో ప్రభుత్వంపై విజయం సాధించామనుకుంటున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు హై కోర్టు నుంచే చుక్కెదురైంది. ఇదివరకు ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా హై కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించింది.
ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం డివిజన్ బెంచ్... గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రెండు నెలలపాటు స్టే విధిస్తున్నట్టు స్పష్టంచేసింది. హై కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో తెలంగాణ సర్కార్‌కి హైకోర్టులో ఊరట లభించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు న్యాయపరమైన చిక్కులు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ కేసులో హై కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి కోర్టుని ఆశ్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.