తెలంగాణలో కానిస్టేబుల్ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇటీవలే నిర్వహించిన కానిస్టేబుల్ అర్హత పరీక్ష వివరాలు ఈ రోజు అధికారికంగా విడుదల అయ్యాయి

Last Updated : Oct 14, 2018, 08:34 PM IST
తెలంగాణలో కానిస్టేబుల్ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఇటీవలే నిర్వహించిన కానిస్టేబుల్ అర్హత పరీక్ష వివరాలు ఈ రోజు అధికారికంగా విడుదల అయ్యాయి. ఈ పరీక్షలో దాదాపు 50.09% మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 16,925 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇటీవలే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ పరీక్షను నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు.. వీవీ శ్రీనివాసరావు ఛైర్మన్‌గా వ్యవహరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 93.95 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు 4,79,158 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీరిలో 4,78,567 మందిని ప్రిలిమినరీ రాతపరీక్షకు ఎంపిక చేశారు. ఇటీవలే ఈ పరీక్షకు సంబంధించిన కీని కూడా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ రోజు వాటి ఫలితాలను ప్రకటించడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు.. ఫిజికల్ టెస్టు, మెయిన్స్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 

కానిస్టేబుల్ అర్హత పరీక్ష ఫలితాలను www.tslprb.in వెబ్ సైటు ద్వారా వీక్షించవచ్చు. కానిస్టేబుల్ రాతపరీక్ష 200 మార్కులకు జరగ్గా.. ప్రశ్నాపత్రంలో 200 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్, ఆర్థిమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మొదలైన అంశాల్లో ప్రశ్నలను అడగడం జరిగింది. ఈ రాతపరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. చిత్రమేమిటంటే.. తొలిసారిగా ఈ పరీక్షను తెలుగులో రాసే సౌలభ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అభ్యర్థులకు కలిగించడం జరిగింది. 

Trending News