బైక్ పై క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన ఓవైసీ: ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ తో మంతనాలు

            

Last Updated : Dec 10, 2018, 03:06 PM IST
బైక్ పై క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన ఓవైసీ: ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ తో మంతనాలు

హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఇరువురు మంతనాలు జరిపారు. లెక్కల్లో తేడా వస్తే ఎవరి ఎవరితో కలవాలి అన్నదానిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే ఇండిపెండెంట్ల మద్దతు తీసుకోవాలని ఈ సందర్భంగా ఓవైసీ సూచించినట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్ ముందు బీజేపీ రూపంలో మరో ఆప్షన్ ఉంది. ఈ నేపథ్యంలో అధికారం కోసం బీజేపీ సపోర్ట్ తీసుకుంటే తాము ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని కేసీఆర్ కు ఓవైసీ తెగేసి చెప్పినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి

బీజేపీ దగ్గర కాకుండా చేసే ఓవైసీ వ్యూహం

రాష్ట్రంలో ఒక వేళ హంగ్‌ ఏర్పడితే ఏంచేయాలన్నదానిపై బీజేపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు  తెలిసింది. అలాంటి పరిస్థితులు ఏర్పడితే హస్తానికి అధికారం రాకుండా చేయాలని కమలదళం నిర్ణయించింది.  ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ కు మద్దతిచ్చే అంశంపై ప్రస్తుతం ఆ పార్టీలో కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ.. టీఆర్ఎస్ కు బీజేపీ దగ్గరకాకుండా చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఆయన ఈ రోజు కేసీఆర్ తో భేటీ అయ్యారు. 

ఎట్టకేలకు మీడియా కంటికి చిక్కిన ఓవైసీ

మీడియా కంటికి చిక్కకుండా ఉండేందు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సరికొత్త పంథాను అనుసరించారు. ఎప్పటిలా కారులో కాకుండా బైక్ పై ఆయన క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. ఓవైసీ - కేసీఆర్ భేటీ విషయంలో ముందే లీకైన నేపథ్యంలో ఓవైసీ రాక కోసం కాసుకొచి కూర్చున్న మీడియా పతినిధులు.. బైక్ పై వస్తున్న ఓవైసిని గుర్తించింది. ఇలా మీడియా కంటిని తప్పించుకోవాలని ఓవైసీ విఫలయత్నం చేశారు.

Trending News