ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టవా ? ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరుపై హై కోర్టు సీరియస్

ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టవా ? ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరుపై హై కోర్టు సీరియస్

Updated: Oct 15, 2019, 10:33 PM IST
ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టవా ? ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరుపై హై కోర్టు సీరియస్

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజల కోసమే సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వానికి ప్రజల కష్టాలను పట్టించుకునే బాధ్యత లేదా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. కార్మికులు కూడా ప్రజల్లో భాగమే కదా అని వ్యాఖ్యానించిన కోర్టు.. సమ్మె ముగించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించింది. చర్చలతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునన్న కోర్టు... ఆర్టీసి కార్మికులతో చర్చలు జరిపేందుకు రెండు రోజుల డెడ్ లైన్ విధిస్తూ పిటిషన్ విచారణను అక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అదే సమయంలో ప్రభుత్వం ఎస్మా(ఎమర్జెన్సీ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ యాక్ట్) ఎందుకు ప్రయోగించకూడదో చెప్పాలని ఆర్టీసి జేఏసిని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా సమ్మె చేసినా ఫలితం లేదు కనుక ఇకనైనా సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని టిఎస్ఆర్టీసీ జేఏసికి కోర్టు సూచించింది.

కోర్టులో వాదనల సందర్భంగా ఆర్టీసికి రెగ్యులర్ ప్రాతిపదికన ఒక ఎండీ అంటూ ఎవ్వరూ లేకపోవడంతో తమ సమస్యలను ఎవ్వరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని, అలాగని చివరకు సమ్మె చేపడతామని ప్రభుత్వానికి నోటీసు ఇస్తే.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆర్టీసీ జేఏసి నేతల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్టీసీకి రెగ్యులర్ ఎండిని నియమించకుండానే తాత్కాలిక ఎండీలతో కాలం వెళ్లదీస్తున్నారని గ్రహించిన కోర్టు.. ఎండీ లేకుండానే సంస్థను ఎలా నడిపిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.